Share News

పది తర్వాత ఏంటి?

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:33 PM

ప్రస్తుతం పదో తరగతిలో మంచి మార్కులు వస్తే చాలు అనుకునే రోజులు పోయాయి. పది తరగతి తర్వాత తీసుకునే ప్రతి అడుగు విద్యార్థి భవిష్యత్‌ను నిర్మిస్తుంది.

పది తర్వాత ఏంటి?

-తల్లిదండ్రులు మంచి నిర్ణయం తీసుకోవాలి

-పిల్లల ఆసక్తి, అభిరుచిని తెలుసుకోవాలి

-ఇంటర్మీడియట్‌కు అచంచల ప్రాధాన్యం

-మంచి మార్కులొస్తే ట్రిపుల్‌ ఐటీల్లో అవకాశం

-వృత్తివిద్యా కోర్సులతో త్వరగా ఉద్యోగావకాశాలు

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం పదో తరగతిలో మంచి మార్కులు వస్తే చాలు అనుకునే రోజులు పోయాయి. పది తరగతి తర్వాత తీసుకునే ప్రతి అడుగు విద్యార్థి భవిష్యత్‌ను నిర్మిస్తుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యకు ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అది మరింత పెరిగిందనే చెప్పాలి. పదో తరగతి వరకు ఎక్కడ చదవామన్నది ముఖ్యం కాకపోయినా, ఆ తర్వాత ఎలాంటి కోర్సు ఎంచుకున్నాం? ఏ కళాశాలలో చేరతాం? అన్నవే అసలైన సవాళ్లు. తొందరపాటులో కాకుండా.. ఆలోచనాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకోవాలి. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు మంచి కాలేజీపైనే దృష్టిపెడతారు. కానీ పిల్లల ఆసక్తి ఏంటి? వారు ఏ సబ్సెక్ట్‌లో రాణిస్తున్నారు? వారికి ఏ రంగంలో అభిరుచి ఉంది? అనే అంశాలు గమనించడం లేదు. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉండే కోర్సుల గురించి విద్యార్థుల కోసం..

గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్న కోర్సుల్లోనే చేర్పించడం సాధారణంగా కనిపిస్తోంది. కొంచెం ముందుచూపుతో మంచి అవకాశాలను వెతికి, సరైన మార్గంలో పిల్లలకు నడిపిస్తే వారి భవిష్యత్‌ బంగారుబాట అవుతుంది. ఆలస్యంగా పశ్చాత్తాపడే కంటే ముందుగానే సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

విద్యార్థులకు ఆసక్తే విజయదారి

పదో తరగతి తర్వాత కోర్సుల ఎంపిక చదువు గురించి తీసుకునే నిర్ణయం కాదు. అది జీవితాన్ని మలుపు తిప్పేదిగా గుర్తించాలి. విద్యార్థుల ఆసక్తి, వారి స్వభావం, ఉపాధ్యాయుల సలహాలు తీసుకుని సమన్వయం చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన దిశలో వేసిన చిన్న అడుగు భవిష్యత్‌లో గొప్ప విజయానికి నాంది అవుతుంది.

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో-

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష రాయాలి. తాటిపూడి (బాలికలు, విజయనగరం), నాగార్జునసాగర్‌ (బాలురు, గుంటూరు), వెంకటగిరి (బాలురు, నెల్లూరు), నిమ్మకూరు (కో ఎడ్యుకేషన్‌, కృష్ణా జిల్లా)లో గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సీటు వస్తే భవితకు బంగారు బాటపడినట్టేనన్న అభిప్రాయం ఉంది.

ఇంటర్మీడియట్‌లో ఇవీ గ్రూపులు

పదో తరగతి తర్వాత విద్యార్థి ముందున్న అతి పెద్ద ప్రశ్న ఏగ్రూపు తీసుకోవాలి అనేది. అందుకే ప్రతి గ్రూపు గురించి స్పష్టమైన అవగాహన అవసరం.

ఎంపీసీ (ఇంజనీరింగ్‌ దిశగా అడుగు): ఈ గ్రూపులో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు ప్రధాన సబ్జెక్ట్‌లు. గణితం పట్ల మంచి పట్టుతో పాటు సమస్యలను పరిష్కరించే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది సరైన ఎంపిక. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ కోర్సులో చేరి ఉన్నతంగా స్ధిరపడే అవకాశం ఉంది. టెక్నాలజీ రంగంలోని విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుని మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు పొందవచ్చు.

బైపీసీ (వైద్య రంగానికి మార్గం): ఈ గ్రూపులో వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాలు ప్రధాన సబ్జెక్ట్‌లు. ప్రకృతి, జీవ శాస్త్రాలసై ఆసక్తి ఉన్నవారికి ఇది ఉత్తమం. దీని తర్వాత ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంబీబీఎస్‌, బీవీఎస్సీ, ఏజీ బీఎస్సీ తదితర కోర్సుల్లో సీటు పొందవచ్చు. వైద్య రంగంలో ఉన్నత స్థాయి అవకాశాలు ఉన్నాయి. సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం ఉంటుంది.

సీఈసీ(వాణిజ్య విజయం వైపు): ఈ గ్రూపులో కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌లు. బిజినెస్‌, అకౌంటింగ్‌, ఆర్ధిక వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు సరైన ఎంపిక. సీఏ, సీఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఆడిటర్లుగా, అకౌంటెంట్‌లుగా స్థిరమైన కెరీర్‌ పొందవచ్చు.

హెచ్‌ఈసీ (పరిపాపాలనా సేవల దారి): హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్ట్‌లు ఈ గ్రూపులో ఉంటాయి. సామాజిక విషయాలు, పాలనపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఉపయోగం. ఏపీపీఎస్సీ, సివిల్స్‌ సర్వీసెస్‌కు బలమైన పునాది. ప్రభుత్వ రంగంలో ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసే స్థానాలను పొందవచ్చు.

ట్రిపుల్‌ ఐటీలో అవకాశం-

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ(ఆర్‌కే వ్యాలీ)లో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. ఇది ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు. సాధారణంగా పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ ప్రాప్తికి సీట్లను కేటాయిస్తారు. నాణ్యమైన విద్య, అగ్రశేణి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు, మంచి జీతభత్యాలతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.

ఇంటర్‌లో వృత్తి విద్యా కోర్సులు

వృత్తి విద్యా కోర్సుల వల్ల ప్రయోజనం ఎక్కువే. వెటర్నరీ, అగ్నికల్చరల్‌, రేడియో అండ్‌ టీవీ, ఇంజనీరింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ మేనేజ్‌మెంటు, పారా మెడికల్‌ కోర్సులు, ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌, కేటరింగ్‌, డెయిరీ, ఆఫ్తాలమిక్‌ అసిస్టెంట్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో చాలా మంది వృత్తి విద్యా కోర్సులు చదివిన అభ్యర్ధులు ఎంపికయ్యారు. ఇటీవల ఈ కోర్సులు చదివే వారి సంఖ్య పెరిగింది.

పాలిటెక్నిక్‌ కోర్సులు

పదో తర గతి తర్వాత సాంకేతిక విద్యలో చేరాలన్న ఆసక్తి ఉంటే పాలిసెట్‌ను రాయాలి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దాదాపు అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కూడా పాలిటెక్నిక్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌, సివిల్‌, కంప్యూటర్స్‌, కెమికల్‌, ఆటోమోబైల్‌ తదితర కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తిచేస్తే పబ్లిక్‌ మరియు ప్రైవేటు సెక్టార్‌ల్లో ఉద్యోగాలు సాధించవచ్చు. అలాగే సొంతంగా కూడా ఉపాధి పొందవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈసెట్‌ రాసి ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో నేరుగా చేరవచ్చు.

వ్యవసాయ కోర్సులు

వ్యవసాయ కోర్సులకు మంచి గిరాకీ వుంది. డిప్లొమో ఇన్‌ అగ్రికల్చల్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో, విత్తనోత్పత్తి కేంద్రాల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ పరంగా వ్యవసాయ శాఖలో ఏఈవోలు, ఆత్మ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు సాధించవచ్చు.

ఐటీఐ కోర్సులు

పదో తరగతి పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు అవసరం లేకుండా స్వయం ఉపాధికి, పరిశ్రమల్లో, రైల్వే తదితర రంగాల్లో ఉద్యోగాల సాఽధనకు ఈ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఫిట్టర్‌, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ తదితర కోర్సులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఐటీఐలు ఈ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. పరిశ్రమల్లో చాలామంది ఐటీఐ చదివిన అభ్యర్థులు స్ధిరపడుతున్నారు.

పిల్లల ఇష్టాన్ని గుర్తించాలి

ప్రధానంగా పిల్లలు ఇష్టాన్ని గుర్తించాలి. వారి అభిరుచి మేరకు చదివించాలి. ఏ కోర్సు చేరితే వెం టనే ఉపాధి అవకాశాలు ఉంటాయ అనేది తెలియజేయాలి. బలవంతం చేయడం సరికాదు. పాలిటెక్నిక్‌ కోర్సులో చేరే విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉంది. రిలీవ్‌ అయిన వెంటనే ఉద్యోగావ కాశాలు వస్తున్నాయి. పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మా కాలేజీ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తున్నాం. మెటిరియల్‌ కూడా ఉచితంగా అందిస్తున్నాం. విద్యార్థులు దీనిని వినియోగించుకోవాలి.

- జి.సత్యనారాయణ, పిన్సిపాల్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, విజయనగరం

ఐటీఐతో వెంటనే ఉద్యోగాలు

పదో తరగతి తరువాత చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు వస్తు న్నాయి. ఇక్కడ నుంచి రిలీవ్‌ అయిన విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందా రు. అన్ని వర్గాలకు చెందిన విద్యార్ధులకు చాలా ఉపయో పడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచులు తెలుసుకోవాలి. ఎటువంటి కోర్సు చేరితే బాగుంటుందని పిల్లలను ప్రోత్సహించాలి. ఎలక్ట్రిల్‌, డీజిల్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ వంటి కోర్సులకు మంచి డిమాండ్‌ ఉంది.

- వీవీ గిరి, కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ ఐటీఐ, విజయనగరం

Updated Date - Apr 04 , 2026 | 11:33 PM