ఏ కష్టమొచ్చిందో?
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:38 PM
గిరిజన మహిళకు ఏ కష్టమొచ్చిందో ఏమో! పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోనే ఘటన
బెలగాం, జూలై12(ఆంధ్రజ్యోతి): ఆ గిరిజన మహిళకు ఏ కష్టమొచ్చిందో ఏమో! పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ మండలం లొద్ద గ్రామానికి చెందిన ఊయక బుజ్జమ్మ (35)కు నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల కిందట భర్త చనిపోయాడు. కాగా పార్వతీపురం పట్టణంలోని తహసీల్దార్ అటశీ శాఖ కార్యాలయాల మధ్య ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయాన్నే చెట్టుకు వేలాడుతూ కనిపించిన మహిళ మృతదేహాన్ని చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పార్వతీపురం పట్టణ ఎస్‌ఐ గోవింద్ వెంటనే తన సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. వివరాలు సేకరించారు.. అనంతరం మహిళ మృతదేహాన్ని శవపంచనామా కోసం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. మద్యం మత్తులో బుజ్జమ్మ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసిందని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.