What was intended was one thing...! అనుకున్నదొక్కటి..!
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:06 AM
What was intended was one thing...! బొబ్బిలి మున్సిపాలిటీలో వివిధ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి, అభివృద్ధి పనులు చేపట్టడానికి ఏపీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.4 కోట్లు విడుదల చేస్తూ ఆ సంస్ధ మేనేజింగ్ డైరెక్టరు నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. దీంతో సంతోషించిన యంత్రాంగం చివరలో పెట్టిన మెలిక చూసి ఖంగు తిన్నారు.
అనుకున్నదొక్కటి..!
మున్సిపాలిటీకి రూ.4 కోట్లు మంజూరు
రుణం కింద అని మెలిక
ఆనందించాలా? రుణభారానికి కుంగిపోవాలా?
డైలమాలో అధికార యంత్రాంగం
బొబ్బిలి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీలో వివిధ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి, అభివృద్ధి పనులు చేపట్టడానికి ఏపీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.4 కోట్లు విడుదల చేస్తూ ఆ సంస్ధ మేనేజింగ్ డైరెక్టరు నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. దీంతో సంతోషించిన యంత్రాంగం చివరలో పెట్టిన మెలిక చూసి ఖంగు తిన్నారు. ఈ మొత్తానికి సంబంధించిన రీ పేమెంట్ షెడ్యూల్‌ను తరువాత ప్రకటిస్తామని పేర్కొనడంతో ఈ నిధులను మున్సిపాలిటీకి రుణం కింద ఇచ్చినట్లుగా అర్థమై పెదవి విరుస్తున్నారు. మున్సిపల్ శాఖమంత్రి పొంగూరు నారాయణ ఇటీవల బొబ్బిలి మున్సిపాలిటీని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బొబ్బిలి పట్టణంలో అత్యవసరంగా చేపట్టాల్సిన అనేక పనులకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన కోరుతూ మంత్రి నారాయణకు వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి అక్కడికక్కడే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు ఎంతో సంతోషించారు.
ఫ మంత్రి హామీ ప్రకారం బొబ్బిలి మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, రాణిమల్లమ్మదేవి పార్కు అభివృద్ధి, వీధిదీపాల కోసం ఏపీయూఎఫ్‌ఐడీసీ ద్వారా డీటీపీసీ (ఎల్‌ఆర్‌ఎస్-బీపీఎస్) నిఽధుల కింద నాలుగుకోట్ల రూపాయలను తాజాగా విడుదల చేసింది. పనుల ప్రగతి ఆధారంగా ఈ నిధులను మున్సిపల్ కమిషనర్ ఖాతాకు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని ఏపీయూఎఫ్‌ఐడీసీకి ఏ ప్రాతిపదికన వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలన్న దానిపై తరువాత తెలియపరుస్తామని ఆ సంస్థ స్పష్టంచేసింది. మున్సిపాలిటీలో ఆర్థిక వనరులు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో నాలుగు కోట్ల రుణభారాన్ని మోయడం మరింత క్లిష్టతరమవుతుందని పలువురు సీనియర్ మాజీ కౌన్సిలర్లు, అనుభవజ్ఞులు చెబుతున్నారు. ప్రభుత్వం, మున్సిపల్ మంత్రి దీనిపై పునరాలోచన చేసి మున్సిపాలిటీకి మంజూరు చేసిన రూ.4 కోట్ల మొత్తాన్ని గ్రాంటు కింద మార్చాలని కోరుతున్నారు.
మున్సిపాలిటీకి రూ.4 కోట్లు మంజూరు
బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కృషి ఫలితంగా మున్సిపాలిటీకి ఏపీయూఎఫ్‌ఐడీసీ నుంచి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. బైపాస్ రోడ్డు మరమ్మతులు, తాగునీటి పైపులైన్ మరమ్మతులు, వీధిదీపాలు, మున్సిపల్ పార్కు అభివృద్ధి కోసం ప్రతిపాదించాం. ఈ పనుల ప్రగతిని చూపించిన తరువాత నిధులను మున్సిపాలిటీకి జమ చేస్తారు. రీ పేమెంట్‌కు సంబంధించి విధివిధానాలను తర్వాత పంపుతామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని రుణం కింద నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- లాలం రామలక్ష్మి, మున్సిపల్ కమిషనర్, బొబ్బిలి