What Trouble ఏ కష్టమొచ్చిందో?
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:54 PM
What Trouble Has Struck? ఏమైందో ఏమో.. ఏ కష్టమొచ్చిందో.. ? అంతవరకు అందరితో సదరాగా గడిపిన వారు తెల్లవారేసరికి విగతజీవులుగా మారిపోయారు. కన్నబిడ్డలు, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అను మానాస్పద స్థితిలో మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
కుమార్తె పరిస్థితి విషమం
వనజ గ్రామంలో విషాదచాయలు
జియ్యమ్మవలస, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఏమైందో ఏమో.. ఏ కష్టమొచ్చిందో.. ? అంతవరకు అందరితో సదరాగా గడిపిన వారు తెల్లవారేసరికి విగతజీవులుగా మారిపోయారు. కన్నబిడ్డలు, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అను మానాస్పద స్థితిలో మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జియ్యమ్మ వలస మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
వనజ గ్రామానికి చెందిన మీనక మధుసూదన్ (35) తాపీమేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య సత్యవతి(30), కుమార్తెలు మాధురి, మోక్ష, ఆయోష, కుమారుడు మోషే (4) ఉన్నారు. భార్య, కుమార్తె ఆయోష, కుమారుడు మోషేతో కలిసి గ్రామం లోనే నివసిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు చినమేరంగి కేజీబీవీలో చదువుతూ అక్కడే ఉన్నారు. కాగా గురువారం రాత్రి మధుసూదన్‌తో పాటు భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అందరితో సరదాగా గడిపారు. తరువాత సోదరులు మాధవ, కల్యాణ్‌తో కలిసి ఇంటి సమీపంలో మంట వేసి కాసేపు చలికాగారు. ఇంట్లోకి వెళ్లి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో సోదరుడు కల్యాణ్ మధుసూదన్‌కు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. వెంటనే ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. అయినా సమాధానం రాకపోవడంతో తలుపులు పగులకొట్టి చూడగా.. సత్యవతి, మోషే , మధుసూదన్, ఆయోష విగతజీవులుగా పడి ఉండడం చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే 108 వాహనంలో హుటాహుటిన వారిని చినమేరంగి సీహెచ్‌సీకి తరలించారు. ఆసుపత్రికి వచ్చిన కాసేపటికే మధుసూదన్ మృతి చెందగా.. అంతకుముందే సత్యవతి, మోషే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయోష పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యాధికారులు వాసుదేవరావు, కృష్ణచైతన్య సూచనలతో మెరుగైన వైద్య సేవల కోసం బాలికను పార్వతీపురం జిల్లా కేంద్రాసు పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా వారు చనిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పురుగుల మందు తాగి మృతి చెందారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కానీ వైద్యులు నిర్ధారించలేదు. చినమేరంగి సీహెచ్‌సీలోనే మృతులకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
అనాధలైన పిల్లలు
తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో చినమేరంగి కేజీబీవీలో చదువుతున్న మీనక మాధురి, మోక్షతో పాటు చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆయోష అనాధలుగా మిగిలిపోయారు. ఆసుపత్రిలో విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులు, తమ్ముడిని చూసి మాధురి, మోక్ష, భోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ చినమేరంగి సీహెచ్‌సీకి హుటాహుటిన చేరుకున్నారు. మాధురి, మోక్షతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకుంటామని విప్ జగదీశ్వరి హామీ ఇచ్చారు. దహన సంస్కారాల కోసం తక్షణ సహాయం కింద రూ. 20 వేలు అందజేశారు.
పూర్తి దర్యాప్తు చేస్తాం
పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావుతో కలిసి వనజ గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అక్కడి నుంచి చినమేరంగి సీహెచ్‌సీకి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. తరువాత డీఎస్పీ విలేఖరులతో మాట్లాడుతూ... మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఇంటి వద్ద పూర్తిగా పరిశీలించినా ఆధారాలు దొరకలేదని తెలిపారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోందన్నారు. ఏదేమైనప్పటికీ పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి మృతికి గల కారణాలను కనుక్కొంటామని వెల్లడించారు. ఈయన వెంట చినమేరంగి, జియ్యమ్మ వలస ఎస్‌ఐలు పి.అనీష్, ప్రశాంత్‌కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మృతికి గల కారణాలను కనిపెట్టాలి: ఎస్పీ మాధవరెడ్డి
వనజ గ్రామంలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి మృతికి గల కారణాలను కనిపెట్టాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. శుక్రవారం చిన మేరంగి సీహెచ్‌సీలో మృతదేహాలను పరిశీలించారు. మృతికి గల కారణాలను వైద్యులు, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వనజ గ్రామానికి చేరుకుని మృతి చెందిన వారి ఇంటిని పరిశీలించారు. ఇరుగుపొరుగు వారితో మాట్లడి.. ఏమి జరిగిందనే దానిపై ఆరా తీశారు.