What Trouble Has Arisen? ఏ కష్టమొచ్చిందో?
ABN , Publish Date - May 20 , 2026 | 11:30 PM
What Trouble Has Arisen? ఏమైందో ఏమో.. ఏ కష్టమొచ్చిందో! అంతవరకు అందరితో సరదాగా గడిపిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెల్లారేసరికి భార్య మృతి చెందగా.. భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
పార్వతీపురం టౌన్, మే20(ఆంఽధ్రజ్యోతి) : ఏమైందో ఏమో.. ఏ కష్టమొచ్చిందో! అంతవరకు అందరితో సరదాగా గడిపిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెల్లారేసరికి భార్య మృతి చెందగా.. భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన బుధవారం పార్వతీపురం పట్టణంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పార్వతీపురం పట్టణంలోని 24వ వార్డు సంకావీధిలో కొన్నాళ్లుగా సంకా శ్రీనివాసరావు(56), శోభారాణి (49) దంపతులు జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఏడాదిన్నర కిందట కుమార్తెకు వివాహం చేశారు. శ్రీనివాసరావు ప్రముఖ కంపెనీలకు చెందిన ఆహార ఉత్పత్తులను హోల్‌సేల్‌గా విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులతో ఆ దంపతులకు ఎటువంటి వివాదాలు లేవు. అందరితో కలిసిపోతూ.. ఎవరికైనా కష్టమొస్తే.. తామున్నామంటూ ముందుకొచ్చేవారు. సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆ భార్యాభర్తలు మంగళవారం రాత్రి వరకు బంధువులు, స్నేహితులు, పిల్లలతో మామూలుగానే మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అర్ధరాత్రి ఆ దంపతులు ఇంటికి సమీపంలో ఉన్న తమ దుకాణానికి వెళ్లారు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం 7 గంటలైనా తలుపులు తీయకపో వడాన్ని గుర్తించిన చుట్టుపక్కల బంధువులు ఇంటి లోపలకు వెళ్లి చూశారు. వారక్కడ లేకపో వడంతో దుకాణానికి వెళ్లి చూశారు. అక్కడ కిందపడి ఉన్న దంపతులను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని.. ఆ దంపతులను అంబులెన్స్‌లో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కాగా శోభారాణి చికిత్స పొందుతూ మృతి చెందగా.. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో మనస్తాపం చెంది.. ఆ భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని ఆయన చెప్పారు.