Share News

What Really Happened? ఏమైందో ఏమో?

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:20 AM

What Really Happened? పాలకొండ మండలానికి చెందిన ఓ గిరిజన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం ఓ గ్రామంలోని చెరువులో మృతదేహం తేలియా డుతూ కనిపించింది. దీంతో పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

What Really Happened? ఏమైందో ఏమో?
బిడ్డిక ఉషారాణి (ఫైల్‌)

  • చెరువులో తేలిన మృతదేహం

  • కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు

  • హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పాలకొండ, జూన్‌10(ఆంధ్రజ్యోతి): పాలకొండ మండలానికి చెందిన ఓ గిరిజన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం ఓ గ్రామంలోని చెరువులో మృతదేహం తేలియా డుతూ కనిపించింది. దీంతో పోలీసులు హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

జంపరకోట పంచాయతీ బర్న సీతంపేటకు చెందిన బిడ్డిక ఉషారాణి (32) గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్‌గా పనిచేసేది. ప్రస్తుతం ఆమె ఖాళీగానే ఉంటోంది. ఉషారాణి తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా ఈ నెల 6న పాలకొండ వెళ్లి వస్తానని చెప్పి బయల్దేరిన యువతి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించారు. ఉషారాణి ఆచూకీపై ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం పాలకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది గంటల తర్వాత యువతి మృతదేహం పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని తుమరాడ వద్ద కామినాయుడు చెరువులో తేలియాడుతూ కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఉషారాణి తండ్రి బిడ్డిక చిన్నారావుకు తెలిపారు. దీంతో ఆయన ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి తమ కుమార్తెనని నిర్ధారించారు. అయితే చెరువులో విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువతి మృతదేహం కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి ఉండడమే కాకుండా... ఓ రాయిను కట్టి చెరువులో పడేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో తమ కుమార్తెను ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:20 AM