What Next? ఇప్పుడేం చేద్దాం?
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:19 AM
What Next? ‘మావిగన్ అజెండాతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతాం మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌ను చేరుస్తాం. ’ అని ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితేమిటోనని మథనపడుతున్నారు.
భవిష్యత్‌పై గుబులు..
ప్రజల్లోకి ఎలా వెళ్తామంటూ ఆందోళన
పార్వతీపురం, జూలై4(ఆంధ్రజ్యోతి): ‘మావిగన్ అజెండాతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతాం మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌ను చేరుస్తాం. ’ అని ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితేమిటోనని మథనపడుతున్నారు. గతంలో ‘మూడు రాజధానులు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ’ అంటూ జగన్ ప్రకటనలు గుప్పించారు.. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పినా.. ప్రజలు నమ్మలేదు. ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పి 11 సీట్లతో సరిపెట్టారు. ఇంత జరిగినా.. రాజధాని అమరావతిని కాదని జగన్ నేడు ‘మావిగన్’ అని మొదలుపెట్టడంతో ఆ పార్టీ శ్రేణులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నినాదంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లగలం? అని ప్రశ్నించుకుంటున్నారు. మావిగన్ పేరిట ప్రచారాలు కూడా చేయలేమని , ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమానం పొందేందుకు ప్రయత్నించాల్సింది పోయి.. రాజధాని పేరుతో రాజకీయాలేమిటని కొందరు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా తమ నాయకుడు ఆలోచనలతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు.. కొంతమంది టీడీపీ నాయకుల వద్ద చెప్పు కోవడం చర్చనీయాం శమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని.. ఇప్పుడేమో మావిగన్ పేరిట వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని జగన్ ప్రకటించడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. రాజధాని అమరావతిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వేళ.. వైసీపీ అధినేత తీరు వారికి ఇబ్బంది కలిగిస్తోంది. రాజధానిపై ఇంకా స్పష్టత లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తే .. ఏం సమాధానం చెప్పగలమని జిల్లా వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. మొత్తంగా వైసీపీ అఽధినేత జగన్ తీరుతో వారు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఈ నిర్ణయంపై జిల్లాలో వ్యతిరేక స్పందన వస్తోంది.
కూటమి వచ్చాక అభివృద్ధి పథం..
కూటమి వచ్చిన తరువాత ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో సింహాభాగం ప్రయోజనాలు ఉమ్మడి జిల్లాకు దక్కుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్స వానికి సిద్ధమైంది. ఐటీ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రిలయన్స్ డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఐటీ పరిశ్రమలు జిల్లాకు వస్తున్నాయి. విశాఖ-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం..ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఈ తరుణంలో జగన్ మావిగన్ ప్రతిపాదన వైసీపీ శ్రేణులను తీవ్ర నైరాశ్యంలో నెట్టింది.
ఆయన మాటలు అర్థం కావడం లేదు
‘గతంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో మూడు రాజధానులు అంటూ మా పార్టీ అధినేత హడావుడి చేశారు. అయినా గత ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని నమ్మలేదు. తాజాగా రాజధాని మావిగన్ అంటూ మా నాయకుడు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మాకేమీ అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రచారాలు కూడా ఏ విధంగా చేయాలో తెలియడం లేదు.’ అని వైసీపీకి చెందిన ఒక సీనియర్ కార్యకర్త తెలిపారు.
===============================
అమరావతిని అంగీకరించడమే మంచిది
‘అమరావతిని రాజధానిగా జగన్ అంగీకరించడమే మంచిది. మూడు రాజధానులని గత ఎన్నికల్లో చెప్పడంతో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయాం. జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాం. ఇటువంటి పరిస్థితి మా పార్టీకి వస్తుందని ఊహించలేదు. అమరావతిని రాజధానిగా వైసీపీ కూడా అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రచారానికైనా వెళ్లొచ్చు. గెలుపోటములు పక్కన పెడితే హుందాగా ప్రచారమైనా చేసుకోవచ్చు. ఏదేమైనా రాజధాని మావిగన్ అంటూ వచ్చే ఎన్నికల్లో ఎలా బరిలోకి దిగాలో అర్థం కావడం లేదు. ’ అని ఒక సీనియర్ వైసీపీ నాయకుడు తెలిపారు.