ఇదేం ‘పల్లె పండుగ’?
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:25 AM
పల్లె పండుగ పేరిట గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
- జనావాసాలు లేని చోట సీసీ రోడ్లు
- అవసరమైన చోట నిర్మించని వైనం
- పంచాయతీరాజ్ అధికారుల తీరుపై విమర్శలు
బొబ్బిలిరూరల్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పల్లె పండుగ పేరిట గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. వీటిని జనావాసాలు ఉన్న చోట నిర్మించాలి. కానీ, బొబ్బిలి మండలంలో మాత్రం ఊరి శివారున ఉన్న కళ్లాలు, పొలాలకు వెళ్లేందుకు నిర్మించారు. దీంతో పంచాయతీరాజ్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనుల ఎంపిక నుంచి నిర్మాణం వరకు అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిత్రకోటబొడ్డవలస, సీతయ్యపేట, నారసింహునిపేట, పారాది, చెల్లారపువలస తదితర గ్రామాల్లో జనావాసాలు లేని ప్రాంతాల్లో సుమారు 100 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు సీసీ రోడ్లు నిర్మించారు. ప్రజలు నివసించే వీధుల్లో మాత్రం రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల కొలతలు ఎవరు నమోదు చేశారు?. నాణ్యతను ఎవరు పరిశీలించారు?. ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతమా? కాదా అన్నది అధికారులు పరిశీలించారా? లేదా? అన్న అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి రోడ్లకు బిల్లులు ఎలా మంజూరు చేశారని ఆయా గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. చిత్రకోటబొడ్డవలస, వెంటరాయుడిపేట, సీతయ్యపేట, గోపాలరాయుడుపేట తదితర గ్రామాల్లో రోడ్లు లేని వీధులను గుర్తించి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ డీఈఈ వసంత అప్పారావుని వివరణ కోరగా.. తమ దృష్టికి రాలేదని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.