Share News

What kind of calculation is this? ఇదేం లెక్క?

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:57 PM

What kind of calculation is this? ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు కనీస స్థాయిలో కురవలేదు. దీంతో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడి పైనా అంచనాలు తప్పాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 22 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.

What kind of calculation is this? ఇదేం లెక్క?

ఇదేం లెక్క?

కరువంటూనే వరి దిగుబడిపై భారీ అంచనాలు

4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తారట

ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి వరి దిగుబడి తగ్గే ప్రమాదం

గతంలో అధికారులే ధ్రువీకరణ

మరోవైపు 22 మండలాల్లో కరువు ఉందని ప్రభుత్వ ప్రకటన

అంతలోనే ధాన్యం సేకరణపై భారీ లక్ష్యం

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాలు కనీస స్థాయిలో కురవలేదు. దీంతో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడి పైనా అంచనాలు తప్పాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 22 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. అయినా కూడా వరి దిగుబడి.. సేకరణపై వ్యవసాయ శాఖ భారీ అంచనాలు వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 5,37,995 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించుకోవచ్చని అంచనా వేయడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు.

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఈ ఏడాది వరి నాట్లు సకాలంలో పడలేదు. రిజర్వాయర్ల పరిధిలో మినహా మిగిలిన చోట్ల వరి పైరు పెద్దగా ఎదగలేదు. మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో వ్యవసాయశాఖ ఖరీఫ్‌ సీజన్‌లో 5,37,995 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది. నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నులు రైతుల నుంచి సేకరించుకోవచ్చని భావిస్తోంది. మరి ఆ స్థాయిలో దిగుబడి వస్తుందా? అనేది రైతుల ప్రశ్న. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటలు కలిపి 3,21,380 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా ఇందులో 3లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులో ఉన్నాయి. వరి పంట విషయానికి వచ్చేసరికి 2,60,652 ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా ఇందులో 2,55,140 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. ఎద రూపంలో 33,176 ఎకరాల్లోనూ, నాట్లు రూపంలో 2,21,964 ఎకరాల్లోనూ వరి సాగవుతోంది. అయితే ఎకరానికి 24 క్వింటాలు దిగుబడి వస్తుందని వ్యవసాయ అంచనా వేసింది. మొత్తం 5,37,995 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, స్థానిక వినియోగం అనంతరం 4,76,089 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఇందులో 4 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలనుకుంటోంది.

గత ఏడాదితో పోల్చితే..

గత ఏడాది అనుకూలంగా వర్షాలు కురవడంతో జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది వర్షాలు పెద్దగా లేవు. సాగు విస్తీర్ణం తగ్గింది. అయినా కూడా అదే స్థాయిలో దిగుబడిని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా వరి విత్తనాలు వేసుకున్న 25 రోజుల నుంచి 40 రోజుల మధ్య నాట్లు వేసుకుని వర్షాలు అనుకూలంగా కురిస్తే ఎకరాకు 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వరి నారు వేసుకున్న 90 రోజుల తరువాత ఇటీవల కురిసిన వర్షాలకు కూడా నాట్లు వేసుకున్నారు. ఇటువంటి చోట్ల కనీస స్థాయిలో దిగుబడి రావడం కష్టం. వ్యవసాయ శాఖ మాత్రం భారీగా లెక్కలు వేసింది. ఇదిలా ఉంటే జిల్లాలో 27 మండలాలు ఉండగా ఇందులో 22 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయా మండలాల్లో కనీస స్థాయిలో వర్షాలు కురవలేదు. సాగువిస్తీర్ణం తగ్గడంతో పాటు దిగుబడి తక్కువగా వస్తున్న నేపఽథ్యంలోనే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఇందులో తీవ్ర కరువు మండలాలు 10కాగా సాధారణ (మధ్యస్ధ) మండలాలు 12 ఉన్నాయి.

ఫ వరి దిగుబడి అంచనాల పెంపుపై జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎం.రామారావు వద్ద ప్రస్తావించగా ప్రస్తుత పరిస్ధితి ప్రకారమే దిగుబడి అంచనా వేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని, నాలుగు లక్షల వరకూ రైతులు నుంచి సేకరించ వచ్చని అంచనా వేశామని చెప్పారు.

-------------

Updated Date - Oct 08 , 2026 | 10:57 PM