ఇదేం తీరు సారూ!
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:44 AM
What Kind of Behaviour Is This, Sir?! కొమరాడ మండలం అంతర్రాష్ట్ర రహదారిలో రోడ్ సేఫ్టీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది నెలలుగా ఏవోబీ సరిహద్దు కరడ, కూనేరు గ్రామాల మీదుగా ప్రయాణించే వాహనాలను అడ్డుకుని అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
వాహనాలను నిలిపి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణ
ఇద్దరి మధ్య వాగ్వాదం
గుర్తింపు కార్డులు చూపాలని నిలదీత
వెనుదిరిగిన సిబ్బంది
కొమరాడ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం అంతర్రాష్ట్ర రహదారిలో రోడ్ సేఫ్టీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది నెలలుగా ఏవోబీ సరిహద్దు కరడ, కూనేరు గ్రామాల మీదుగా ప్రయాణించే వాహనాలను అడ్డుకుని అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా వారు వాహనాలను ఆపి అధికంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు డ్రైవర్‌పై దాడి చేసినట్లు తెలిసింది. దీంతో లారీ డ్రైవర్లు, రోడ్డు సేఫ్టీ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అనంతరం సదరు వ్యక్తుల వాహనాన్ని లారీ డ్రైవర్లు అడ్డుకుని.. గుర్తింపు కార్డులు చూపించాలని నిలదీశారు. ఈ పరిణామంతో వారు అక్కడ నుంచి వెనుదిరిగినట్టు డ్రైవర్లు తెలిపారు. గతంలోనూ ఇదే తరహా ఘటన జరిగినట్టు వాహనదారులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై పార్వతీపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీస్‌శాఖ, ఆంధ్రా, ఒడిశా రాష్ర్టాల సంబంధిత అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వాహనదారులు, సీఐటీయూ మన్యం జిల్లా కమిటీ సభ్యుడు కిల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని, వసూళ్లకు అడ్డుకట్టవేయాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే డ్రైవర్లకు మద్దతుగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిపై పార్వతీపురం సీఐ రంగనాథంను వివరణ కోరగా.. ‘ఇసుక నాటు బళ్లు, ఆటోలకు చార్జీలు తీసుకోకూడదు. లారీలు, ఇతర భారీ వాహనాలకు నిర్దేశించిన చార్జీలు వసూలు చేయాలి. అదనంగా వసూలు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేపడతాం.’ అని ఆయన తెలిపారు.