What is this master? ఇదేం పద్ధతి మాస్టారు?
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:02 AM
What is this method master? విద్యార్థినుల పట్ల తప్పుగా వ్యవహరిస్తున్న ఓ ఉపాధ్యాయుడ్ని గ్రామస్థులు నిలదీశారు. ఇదేం పద్ధతి అంటూ దుయ్యబట్టారు. దేహశుద్ధి చేయాలనుకున్నారు. ఆ ఉపాధ్యాయుడు క్షమాపణ కోరడంతో శాంతించారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇదేం పద్ధతి మాస్టారు?
ఉపాధ్యాయుడ్ని నిలదీసిన గ్రామస్థులు
తప్పుడు ప్రవర్తనపై ఆగ్రహం
సీఎం ఫేషీ నుంచి కూడా ఆరా
రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు
ఉపాధ్యాయుడు సస్పెన్షన్
రాజాం రూరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):
విద్యార్థినుల పట్ల తప్పుగా వ్యవహరిస్తున్న ఓ ఉపాధ్యాయుడ్ని గ్రామస్థులు నిలదీశారు. ఇదేం పద్ధతి అంటూ దుయ్యబట్టారు. దేహశుద్ధి చేయాలనుకున్నారు. ఆ ఉపాధ్యాయుడు క్షమాపణ కోరడంతో శాంతించారు. ఈ ఘటనతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజాం మునిసిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. ఉపాధ్యాయుడు ఆశియ్య తీరును అందరూ తీవ్రంగా ఖండించారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో రావడంతో సీఎం ఫేషీ నుంచి కూడా ఆరా తీశారు. విద్యాశాఖ అధికారులు విచారించి అతన్ని సస్పెండ్ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
పాలకొండకు చెందిన దూసి ఆశియ్య రెండేళ్లుగా డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇదే పాఠశాలలో ఏడో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన మరో బాలిక పట్ల ఆశియ్య కొంతకాలంగా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. ఉపాధ్యాయుడి తీరుపై ఆ బాలికలు గతంలో హెచ్‌ఎం ఆర్‌వీజీఎన్ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్‌ఎం, ఇతర ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి ఆశియ్యను హెచ్చరించారు. భవిష్యత్తులో పిల్లల పట్ల మంచిగా ఉంటానని ఆ సమయంలో సైన్స్ ఉపాధ్యాయుడు చెప్పడంతో అంతా వదిలేశారు. కాలక్రమంలో ఆ ఉపాధ్యాయుడి తీరులో మార్పు రాలేదు. ఆ ముగ్గురు బాలికలపై మళ్లీ బ్యాడ్‌టచ్‌కు పాల్పడుతున్నాడు. దీంతో చిన్నారులు ముగ్గురూ తల్లిదండ్రులకు తెలియజేశారు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు గ్రామస్థులతో కలిసి గురువారం పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎంకు ఫిర్యాదు చేశారు. ఇతర సిబ్బంది ఎదుట ఉపాధ్యాయుడ్ని నిలదీశారు. దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తప్పయ్యింది క్షమించాలంటూ సైన్స్ ఉపాధ్యాయుడు వేడుకోవడంతో శాంతించారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
డోలపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం చోటుచేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. దీంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎంఈవోలు ప్రవీణ్‌కుమార్, దుర్గారావు గురువారం పాఠశాలలో విచారించి డీఈవో మాణిక్యంనాయుడుకు నివేదించారు. నివేదికలోని అంశాల ఆధారంగా ఆశియ్యను సస్పెండ్ చేస్తూ డీఈవో గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌ను పాఠశాల హెచ్‌ఎం మురళీకృష్ణ ధ్రువీకరించారు. రాజాం టౌన్ సర్కిల్ సీఐ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ రాజశేఖర్ పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు.