What is their 'plan'? వారి ‘ప్లాన్’ ఏమిటో?
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:28 AM
What is their 'plan'? నగరంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు(బీపీఎస్) ప్రభుత్వం గత ఏడాది నుంచి ఈ నెల 11 వరకు అవకాశం ఇచ్చింది. ఇటు స్థలాలకు సంబంధించి (ఎల్‌ఆర్‌ఎస్) కూడా ఇదే గడువు వర్తిస్తుంది. అయితే రెంటింటికీ కలిపి విజయనగరంలో 985 దరఖాస్తులు రాగా 95 మందికే పరిష్కారం చూపారు.
వారి ‘ప్లాన్’ ఏమిటో?
బీపీఎస్ దరఖాస్తుల్లో కనిపించని పురోగతి
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులదీ అదే పరిస్థితి
చోద్యం చూస్తున్న ప్రణాళికా విభాగం
అధికారుల లాగిన్‌లో ఆగిన వందలాది విన్నపాలు
మార్చి 11 ఆఖరు తేదీ
నగరంలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు(బీపీఎస్) ప్రభుత్వం గత ఏడాది నుంచి ఈ నెల 11 వరకు అవకాశం ఇచ్చింది. ఇటు స్థలాలకు సంబంధించి (ఎల్‌ఆర్‌ఎస్) కూడా ఇదే గడువు వర్తిస్తుంది. అయితే రెంటింటికీ కలిపి విజయనగరంలో 985 దరఖాస్తులు రాగా 95 మందికే పరిష్కారం చూపారు. వచ్చిన దరఖాస్తులను నగర ప్రణాళిక అధికారులు నెలలుగా తమ వద్దనే అట్టిపెట్టుకుంటున్నారు. పరిష్కారానికి వాళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. మామూళ్ల కోసమే ఇలా చేస్తున్నారనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. కొంతమంది మధ్యవర్తుల ద్వారా దరఖాస్తుదారుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి.
విజయనగరం టౌన్, మార్చి7(ఆంధ్రజ్యోతి):
విజయనగరంలో 2025 జూన్ 30 నుంచి ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు, బీపీఎస్‌కు కలిపి 985 పైగా దరఖాస్తులు వచ్చాయి. 1995 జనవరి నుంచి 2025 ఆగస్టు 31 వరకూ జరిగిన భవన నిర్మాణాల్లో నగరపాలక సంస్థ నుంచి తీసుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా అతిక్రమించి నిర్మించిన భవనాలతో పాటు అసలు ప్లాన్ తీసుకోకుండానే నిర్మించిన భవనాలను సక్రమం చేసుకోవడానికి బీపీఎస్ కింద అవకాశం ఇచ్చారు. ఈ గడువు ఈ నెల 11తో ముగియనుంది. స్థలాల క్రమబద్ధీకరణదీ ఇదే పరిస్థితి. ఈ రెండు పథకాలకు 985కు పైగా దరఖాస్తులు అందాయి. కార్పొరేషన్‌కు సుమారు రూ.12కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కానీ పరిష్కరించేందుకు ప్రణాళిక అధికారులు పారదర్శకంగా ప్రయత్నించడం లేదనేది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ.
ప్రజల నుంచి వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ ఫైళ్లను కార్పొరేషన్‌లోని నగర ప్రణాళికా విభాగం అధికారులు తొలుత క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఆ తరువాత క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలి. కాగా సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న కొంతమంది ప్లానింగ్ సెక్రటరీలు అక్రమ భవనాలపై దృష్టిసారించి పట్టణ ప్రణాళికా విభాగంలో ఉన్న అధికారులతో లాలూచి పడి కార్పొరేషన్ ఆదాయం కన్నా సొంత ఆదాయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై దరఖాస్తుదారుల నుంచి ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. అధికారుల చేయి తడపందే ఫైళ్లు ముందుకు కదలడం లేదంటున్నారు. ఇప్పటికే అధికారుల లాగిన్లలో వందలాది ఫైళ్లు నెలల తరబడి పేరుకుపోయాయి. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం లేదు. ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న భవన యజమానులు అనుమతులు కోసం ప్లానింగ్ సెక్రటరీలు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది దళారులు పనులు చేయిస్తామని నమ్మబలికి పెద్ద మొత్తంలో నగదును గుంజడంతో పాటు అధికారులకు కూడా వాటాలు అందజేస్తున్నారని తెలుస్తోంది.
- వాస్తవంగా ఏదైనా ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారంటే అదనంగా పత్రాలేమైనా జోడించాలా.. డాక్యుమెంట్లు సరిగా లేవా.. క్షేత్రస్ధాయిలో వాటి పరిస్థితి ఏమిటి.. అన్నది తెలియజేయాలి. ఈ అంశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో దరఖాస్తుదారులకు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏమి ఆశించి స్పందించడం లేదని కొందరు తలలు పట్టుకుంటున్నారు.
త్వరలో క్లియర్ చేస్తాం
ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ దరఖాస్తులు 985 వచ్చాయి. ఇప్పటివరకూ 95మాత్రమే క్లియర్ చేశాం. ఇంకా 890 పెండింగ్‌లో ఉన్నాయి. సైట్ ఇబ్బంది పెట్టడంతో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అలాగే కోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. కొంతమంది దళారులు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ప్లానింగ్ సెక్రటరీలు మా దృష్టికి తీసుకురాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారితో మాట్లాడతాం.
- హరి,ఏపీవో, నగర ప్రణాళికా విభాగం, విజయనగరం