Share News

What is the livestock wealth? పశు సంపద ఎంత?

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:37 PM

What is the livestock wealth? ఉమ్మడి జిల్లాలో ఏడాదిన్నర కిందట పశు గణన జరిగింది. కానీ ఇంతవరకు పశు సంపద ఎంతో ప్రకటించలేదు. నివేదికలను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇంకా పశు సంపద గణాంకాలను బహిర్గతం చేయలేదు.

What is the livestock wealth?  పశు సంపద ఎంత?

  • 2019 గణాంకాల ఆధారంగా కొనసాగుతున్న చికిత్సలు

  • మెరుగైన చికిత్స అందిస్తున్నాం : జేడీ దీనకుమార్‌

జియ్యమ్మవలస, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఏడాదిన్నర కిందట పశు గణన జరిగింది. కానీ ఇంతవరకు పశు సంపద ఎంతో ప్రకటించలేదు. నివేదికలను తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇంకా పశు సంపద గణాంకాలను బహిర్గతం చేయలేదు. దీంతో 2019 సంవత్సరం ఆధారంగానే పశువులకు వైద్య సేవలు కొనసా గుతున్నాయి. దీనివల్ల కలుగుతున్న ఇబ్బందులేవో గుర్తించి పశు సంపదకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- ప్రతీ ఐదేళ్లకొకసారి పశు సంపదను లెక్కిస్తారు. ఈ గణాంకాల ఆధారంగా వాటికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. 2019-24 మధ్య కాలంలో జిల్లాలో ఆవులు 2.29 లక్షలు, గేదెలు 47 వేలు, గొర్రెలు 2.07 లక్షలు, మేకలు 1.73 లక్షలు, కోళ్లు 8.11 లక్షలు ఉన్నాయి. మొత్తంగా 14.67 లక్షలు పశు సంపద ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో పశు సంపద పార్వతీపురం మన్యం జిల్లాతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ గణాంకాల ఆధారంగానే ఇప్పుడు పశు సంపదకు చికిత్స అందుతోంది.

- 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య ఉన్న పశు సంపద ఆధారంగా పశు గణన చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు జాతీయ పశు గణనలో భాగంగా 2024, అక్టోబరు 25 నుంచి 2025, ఫిబ్రవరి 28 వరకు గణన జరిగింది.

- మన్యం జిల్లాలో పశు వైద్యశాలలు 7, పశు వైద్య చికిత్సాలయాలు 37, రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు 24 ఉన్నాయి. వాటి పరిధిలో ఉన్న పశు సంవర్థక శాఖ జేడీ పర్యవేక్షణలో అసిస్టెంట్‌ డైరెక్టర్లు, వైద్యాధికారులు, సిబ్బంది 2.34 లక్షల గృహాలకు వెళ్లి పశు గణన పూర్తి చేశారు.

- విజయనగరం జిల్లాలో పశు సంవర్ధకశాఖ పాలి క్లీనిక్‌ ఒకటి, ప్రాంతీయ పశు వైద్యశాలలు 13, పశు వైద్య చికిత్సాలయాలు 65, రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లు 40, నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులు 6, పిగ్‌ బ్రీడింగ్‌ స్టేషన్‌ ఒకటి, జిల్లా లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ఒకటి ఉన్నాయి. వీటి పరిధిలోని దాదాపు మూడు లక్షలకు పైగా ఇళ్లను సందర్శించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.

- పశు సంవర్థకశాఖ ద్వారా పూర్తి సర్వే చేయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద ఎంత ఉందనేది ఇప్పటికే జిల్లాలకు అధికారికంగా పంపించాల్సి ఉంది. అంతేకాకుండా వాటికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడంతో పాటు పాడి రైతులకు మరిన్ని మెరుగైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, విధానాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. అయితే పశు గణనను ఇంకా గోప్యంగా ఉంచడంపై కొందరు బాహాటంగా విమర్శిస్తున్నారు.

మెరుగైన సేవలు అందిస్తున్నాం

జాతీయ పశు గణన-2024 ప్రకారం పశు సంపద గణన పూర్తి చేశాం. అది ఇంకా అధికారికంగా జాబితా రాలేదు. కానీ పశు సంపదకు కావల్సిన మెరుగైన చికిత్స, పాడి రైతులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం.

- దీనకుమార్‌, జాయింట్‌ డైరెక్టర్‌, పశు సంవర్థకశాఖ, పార్వతీపురం మన్యం జిల్లా

Updated Date - Sep 20 , 2026 | 11:37 PM