Share News

What is the condition of those 62 roads? ఆ 62 రోడ్ల పరిస్థితేంటి?

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:07 AM

What is the condition of those 62 roads? రాజాం-పాలకొండ ప్రధాన రహదారి నుంచి రేగిడి మండలం పుర్లి గ్రామం వరకూ 5.21 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.2.89 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 4న పాలనాపరమైన అనుమతులు వచ్చాయి. కానీ ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదు. దీంతో పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు.

What is the condition of those 62 roads? ఆ 62 రోడ్ల పరిస్థితేంటి?
రేగిడి మండలంలోని పుర్లి వెళ్లే రోడ్డు

ఆ 62 రోడ్ల పరిస్థితేంటి?

6నెలల కిందట ఏపీఆర్‌ఆర్‌ఎస్పీ కింద మంజూరు

ఇంతవరకూ ప్రారంభంకాని పనులు

టెండర్లకు కాంట్రాక్టర్ల విముఖతే కారణం

మూలుగుతున్న రూ.83.05 కోట్లు

వందలాది గ్రామాల ప్రజలకు వీడని ప్రయాణ కష్టాలు

- రాజాం-పాలకొండ ప్రధాన రహదారి నుంచి రేగిడి మండలం పుర్లి గ్రామం వరకూ 5.21 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.2.89 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 4న పాలనాపరమైన అనుమతులు వచ్చాయి. కానీ ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదు. దీంతో పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు.

రాజాం, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 62 తారురోడ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు వచ్చి ఆరు నెలలు దాటుతోంది. ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ రహదారులపై ఆధారపడిన వందలాది గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదు. తారు రోడ్ల నిర్మాణానికి ఏపీ గ్రామీణ రహదారుల బలోపేతం కింద ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో 131.48 కిలోమీటర్ల మేర 62 తారు రోడ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికిగాను పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారా రూ.83.05 కోట్లు కేటాయించారు. ఇది జరిగి ఆరు నెలలు అవుతున్నా పనుల్లో మాత్రం ఎటువంటి పురోగతి లేదు. ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా పరిస్థితి ఉంది. మూడుసార్లు టెండర్లకు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిధులు మూలుగుతున్నాయి.

జిల్లాను యూనిట్‌గా చేయడంతోనే..

వాస్తవానికి 62 రోడ్లకు సంబంధించి వేర్వేరుగా టెండర్లు వేసి ఉంటే బాగుండేది. ఇప్పటికే ఖరారై పనులు ప్రారంభమయ్యేవి. కానీ జిల్లాను యూనిట్‌గా చేసుకొని టెండర్లకు పిలవడంతోనే అసలు సమస్య. ఒకేసారి 62 రోడ్లకు టెండర్లు అంటే చిన్న విషయం కాదు. బడా కంపెనీలే చేపట్టగలవు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 1392 రోడ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆయా జిల్లాల్లో పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. కానీ మన జిల్లాలో మాత్రం ఎటువంటి కదలిక లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి జిల్లా యూనిట్‌గా టెండర్ల విధానం తప్పిస్తే తక్షణం పనులు పూర్తయ్యేందుకు అవకాశం ఉంది.

త్వరలో పనులు

ఏపీఆర్‌ఆర్‌ఎస్పీ కింద బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం వాస్తవమే. కానీ జిల్లా యూనిట్‌గా తీసుకొని టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి. అందుకే ఈసారి నియోజకవర్గ స్థాయిలో టెండర్లు పిలవాలనుకుంటున్నాం. ప్రభుత్వ సూచన మేరకు టెండర్లు ఖరారుచేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తాం.

- టీవీ రమణమూర్తి, ఈఈ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం

Updated Date - Aug 28 , 2026 | 12:07 AM