Share News

అదనపు పోలీసుస్టేషన్‌ ఏదీ?

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:34 AM

బొబ్బిలిలో ప్రజావసరాలకు తగ్గట్టుగా మరో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కదలిక లేకుండా పోయింది.

అదనపు పోలీసుస్టేషన్‌ ఏదీ?

బొబ్బిలి జనవరి 17(ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలో ప్రజావసరాలకు తగ్గట్టుగా మరో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కదలిక లేకుండా పోయింది. జిల్లాలో కొత్తగా విజయనగరంలో ఒకటి, భోగాపురంలో ఒకటి కొత్త పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బొబ్బిలిలో కూడా కొత్తగా ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఫ బొబ్బిలి పట్టణంలో 31 మున్సిపల్‌ వార్డు లు, మండలంలో 30 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సుమారు లక్షన్నర జనాభా ఉన్నారు. పట్టణానికి, మండలానికి ఒక్కటే పోలీసు స్టేష న్‌ ఉండడంతో ఇబ్బందిగా ఉంటోది. పరిధి ఎక్కువగా ఉండడంతో శాంతిభద్రతల పర్యవేక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ఫ్యామిలీ కౌన్సిలింగ్‌, ఫిర్యాదుదారుల నుంచే వచ్చే కేసుల విచారణ, పరిష్కారం తదితర వాటి విషయమై పోలీసులపై విపరీతమైన భారం ఉంటోంది. దీనికి తోడుగా పోలీసు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది.

ఫ బొబ్బిలిలో రెండు పోలీసు సర్కిల్‌ కార్యాలయాలున్నాయి. బొబ్బిలి పట్టణం, మండలానికి కలిపి ఒకటి ఉండగా, బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలకు కలిపి ఒకటి ఉంది. బొబ్బిలి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో బొబ్బిలి రూరల్‌ మండలం లేదు. అందుకోసమని గతంలో ఈ రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని నేషనల్‌ హైవే ఉన్న రామభద్రపురం కేంద్రానికి మార్చాలన్న ప్రతిపాదన కూడా తెరమీదకి వచ్చింది.

ఫ బొబ్బిలిలో ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ లేదా మహిళా పోలీసుస్టేషన్‌, రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేయాలని చాలా ఏళ్ల నుంచి ప్రజాప్ర తినిధులు, అన్ని వర్గాల ప్రజలు కోరుతూనే ఉన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. హోమ్‌ మంత్రికి, పోలీసు ఉన్నతాధికారులకు అదనపు స్టేషన్‌ ఆవశ్యకతను వివరించారు. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి విధానపర మైన నిర్ణయం వెలువడడం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఫ ప్రస్తుతం బొబ్బిలి ఎస్‌హెచ్‌వో పరిధిలో పట్టణం, మండలానికి కలిపి 70 మంది పోలీసు సిబ్బంది అవసరం ఉండగా సగం మంది కూడా లేరు. కోర్టు తదితర విధుల కోసం ఒకరు, రిసెప్షన్‌లో ఒకరు, సమన్లు అందజేయడానికి ఒకరు.. ఇలా కొన్ని విధిలుకు శాశ్వతంగా కొందరు ఉండాలి. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతాయి వాటి ఎంఎల్‌సీ కేసులు, శవపంచాయితీ, పోస్టుమార్టమ్‌ తదితర వాటికోసం కనీసం ముగ్గురు ఉండాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌, ఫిర్యాదులపై విచారణ, చోరీ కేసులు చేధించడం కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లడం వంటి విధులు తీరికలేకుండా ఉంటాయి. ఇదే సమయంలో అత్యవసరంగా సెలవులు పెట్టేవారుంటారు.

ఫ గత ఏడాది జూలై 8 న బొబ్బిలిలో పర్యటించిన హోమ్‌మంత్రి వంగలపూడి అనిత దృష్టికి అదనపు పోలీసుస్టేషన్‌ విషయం తెచ్చినప్పుడు ఆమె సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే బేబీనాయన ఎప్పుడు కలిసినా ఈ స్టేష్‌న్‌ గురించి అడుగుతున్నారని, కచ్చితంగా దీనిపై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న బడ్జెట్‌లోనైనా కొత్త స్టేషన్‌ ఏర్పాటుకు అవకాశాలుంటాయా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jan 18 , 2026 | 12:34 AM