ఏం బాగోలేదు
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:11 PM
బొబ్బిలి ఏపీఐఐసీ (గ్రోత్‌సెంటర్) దుస్థితిపై ఆ సంస్థ మేనేజింగ్ డైరెకర్ దినేష్‌కుమార్ తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు.
- బొబ్బిలి గ్రోత్‌సెంటర్ నిర్వహణపై ఎండీ అసంతృప్తి
- ఆస్తిపన్ను వసూలులో వెనుకంజపై పెదవి విరుపు
- ఐలా కమిటీ ఏర్పాటుకు గైడ్‌లైన్స్
- స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని ప్రకటన
బొబ్బిలి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఏపీఐఐసీ (గ్రోత్‌సెంటర్) దుస్థితిపై ఆ సంస్థ మేనేజింగ్ డైరెకర్ దినేష్‌కుమార్ తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేశారు. గ్రోత్‌సెంటర్ నిర్వహణ ఏం బాగోలేదని అన్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన గ్రోత్‌సెంటర్‌ను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న పరిశ్రమల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, సరిపడా నీటి సరఫరా లేదని, లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని వారంతా ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ)ని ఎందుకు ఏర్పాటు చేయలేదని, దీని కారణంగా అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. దీనిపై ఏపీఐఐసీ అధికారులను ఆయన ప్రశ్నించగా.. వారెవరూ సరైన సమాధానం చెప్పలేక పోయారు. ఐలాకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను వెంటనే పంపిస్తానని, కమిటీని వెంటనే వేయాలని ఆయన ఆదేశించారు.
- వేగావతి నదిలో నీటి వనరు సమృద్ధిగా లేదని, అందువల్లనే నీటి సరఫరాలో లోపాలున్నాయని అధికారులు బదులివ్వగా, దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది కొరత కారణంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్నామని, గ్రోత్‌సెంటరు నిర్వహణ అధ్వానంగా ఉంటోందని, తహసీల్దార్ కేడర్ అధికారిని స్పెషల్ ఆఫీసరుగా నియమిస్తామని ఎండీ ప్రకటించారు. బొబ్బిలి ఆర్డీవో తరచుగా మానిటరింగ్ చేయాలన్నారు. రూ.3కోట్ల ఆస్తిపన్నుకు గాను కేవలం కోటి మాత్రమే వసూలు కావడంపై ఆయన పెదవివిరిచారు. గతంలో కాంగ్రెస్, వైసీపీ నేతలకు కేటాయించిన 120 ఎకరాలపై ఆరాతీశారు.
ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం..
గ్రోత్‌సెంటర్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయని వారి నుంచి తిరిగి భూములను స్వాఽ దీనం చేసుకుంటామని ఎండీ దినేష్‌కుమార్ అన్నారు. 445 ఎకరాలు ఖాళీగా ఉన్నాయ న్నారు. కొన్ని భూములకు సంబంధించిన లిటిగేషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. రన్నింగ్ వాటర్, రహదారులు, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మని హామీ ఇచ్చారు. వాణిజ్యఅవసరాలకు కావాల్సిన ప్లాట్లను కేటా యిస్తామన్నారు. ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలకు ఇక్కడ అను కూలంగా ఉందని, సుమారు 8 ఫెర్రోఎల్లా యిస్ పరిశ్రమలు ఆశాజనకంగా నడుస్తున్నా యన్నారు. మోయర్స్, మంగుళూరు ఐరన్ ఓర్ ఇండస్ర్టీస్ లాంటివి రావాల్సి ఉందన్నారు. ఐలా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామ న్నారు. ఆయన వెంట బొబ్బిలి ఆర్డీవో జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు, ఏపీఐ ఐసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ముందుగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
సమాచారం ఇవ్వకుండానే..
ఏపీఐఐసీ ఎండీ బొబ్బిలి గ్రోత్‌సెంటరుకు వస్తున్న విషయాన్ని స్థానిక అధికారులు చాలా గోప్యంగా ఉంచారు. పరిశ్రమల నిర్వా హకులకు, మీడియాకు సమాచారం పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరిశ్ర మల నిర్వాహకులతో ఎండీ నిర్వహించిన సమావేశానికి మొక్కుబడిగా కొద్దిమందిని మాత్రమే రప్పించడం గమనార్హం.