What is happening within the district YCP? జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది?
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:06 AM
What is happening within the district YCP? జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఏముహూర్తాన వైసీపీని వీడి టీడీపీలో చేరారో కాని జిల్లాలో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు గజిబిజిగా మారాయి. రోజుకో వార్త, మార్పులు వినటం.. చూడటం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ రాజకీయ భవిష్యత్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీ పీఠం తన కుమార్తెకే అని కొద్దిరోజుల కిందట బొత్స ప్రకటించగా నేడు భీమిలి ఆసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పంపుతూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఇది ఊహించని నిర్ణయంగా బొత్స వర్గీయులు భావిస్తున్నారు.
జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది?
వరుసగా పరిణామాలు
జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా అనూష అనుకున్నారు
అంతలోనే భీమిలి బాధ్యతల అప్పగింత
పార్టీ జిల్లా పగ్గాలు వేరే నేతకు
బొత్స సత్యనారాయణకు ఏ బాధ్యత అప్పగిస్తారో?
విజయనగరం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఏముహూర్తాన వైసీపీని వీడి టీడీపీలో చేరారో కాని జిల్లాలో ఆ పార్టీలో రాజకీయ పరిణామాలు గజిబిజిగా మారాయి. రోజుకో వార్త, మార్పులు వినటం.. చూడటం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ రాజకీయ భవిష్యత్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జడ్పీ పీఠం తన కుమార్తెకే అని కొద్దిరోజుల కిందట బొత్స ప్రకటించగా నేడు భీమిలి ఆసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పంపుతూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఇది ఊహించని నిర్ణయంగా బొత్స వర్గీయులు భావిస్తున్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఇన్‌చార్జి పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే వైసీపీ నాయకత్వం ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. మరోవైపు కుటుంబంలో రాజకీయ చీలిక రావడంతో బొత్స తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మూడుసార్లు కార్యకర్తల సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనతో పాటు వేదిక పంచుకున్న నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా బాధపడ్డారు. అయితే చివరి వరకూ బొత్స వెంటే నడుస్తానని ప్రకటించారు. అంతలోనే అదే రోజు సాయంత్రానికి వైసీపీ నాయకత్వం బడ్డుకొండపై వేటు వేసింది. నెల్లిమర్ల నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటి నుంచి అందరిలోనూ ఒకటే అనుమానం. అటు బొత్స ఫ్యామిలీ మొత్తం వైసీపీ నుంచి జంప్ అవుతుందా? అనుమానం పెరిగింది. ఇదే విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో బొత్సను తాడేపల్లికి పిలిపించి జగన్ కీలక చర్చలు జరిపారని సమాచారం.
అందరిలోనూ అనుమానమే..
భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బొత్స కుమార్తె అనూషను నియమించారు. దీంతో అందరిలోనూ... అనుమానం ప్రారంభమైంది. అనూషను విశాఖ జిల్లాకు పంపించడంపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణ తన కుమార్తెను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది జడ్పీ చైర్మన్‌గా ఉన్న చిన్నశ్రీనుకు నచ్చలేదు. తన కుమార్తె సిరి సహస్రను జడ్పీ చైర్‌పర్సన్ చేయాలని ఆయన ప్రణాళిక వేసుకున్నారని భోగట్టా. ఇంతలో బొత్స ఏకపక్షంగా ప్రకటించడంతో ఆయన కంగుతిన్నారు. ఆపై మారుమాట లేకుండా తన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరిపోయారు. అయితే అనూషకు భీమిలి బాధ్యతలు ఇవ్వడం ఏమిటనే ప్రశ్న రాజకీయ పరిశీలకుల్లో ఉత్పన్నమవుతోంది. అసలు భీమిలిలో వైసీపీ బలంగా ఉంటే చిన్న శ్రీను పార్టీ మారేవారుకాదేమో అని కూడా ప్రశ్నిస్తున్నారు. బొత్స విషయంలో జగన్ ఏదో ఆలోచనతో ఉన్నారని పార్టీ, రాజకీయ వర్గాల మెదడును తొలిచేస్తున్న బేతాళ ప్రశ్నగా మారింది.
అప్పటి మాదిరిగానే బెల్లానకు..
2014 సమయంలో ఉండే పరిస్థితి ఇప్పుడు వైసీపీలో కనిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా బొత్స ఉండేవారు. 2014 ఎన్నికల సమయంలో సైతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి జిల్లాలో మూడు స్థానాలే వచ్చాయి. అప్పట్లో వైసీపీ జిల్లా బాధ్యతలు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు. ఇప్పుడు కూడా చిన్నశ్రీను ఖాళీ చేసిన జిల్లా పగ్గాలను తిరిగి బెల్లాన చంద్రశేఖర్‌కు అప్పగించారు.
- మరోవైపు కుమార్తె రాజకీయం కోసం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ క్రియాశీలకం అయ్యారు. ఆయన బొత్సతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు లేవనే ప్రచారం ఉంది. హైకమాండ్ ఆదేశాలతో మాత్రమే బొత్సతో కలిసి పనిచేసేవారు. మరి ఇకపై ఎలా ముందుకెళ్తారో చూడాలి. బొత్స మాత్రం పార్టీలో కీలకంగా ఉండేందుకే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మొన్ననే జగన్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అప్పలరాజు జైలులో ఉండగా పరామర్శకు వచ్చారు. ఆ సమయంలో శ్రీకాకుళంలో జగన్ వెంట బొత్స కనిపించారు. అలాగే చిన్నశ్రీను పార్టీని వీడినప్పుడు వెంటనే అప్రమత్తమై కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ద్వితీయ శ్రేణి నాయకులు చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి భరోసా కూడా ఇస్తున్నారు. అయినా కూడా తాజా పరిణామాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు.
వెంటాడుతున్న నాన్‌లోకల్ బెడద
2024 ఎన్నికల్లో బొత్స ఝాన్సిలక్ష్మీ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేశారు. దీంతో నాన్ లోకల్ ప్రచారం పెద్దఎత్తున సాగింది. ఆమె ఆ ఎన్నికల్లో 5లక్షల 4వేల 247 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటున్న బొత్స అనూషను మళ్లీ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. గతంలో మాదిరిగానే ఇక్కడ నాయకులు లేరని అధినేత భావించారా? అని అక్కడి స్థానిక నాయకుల నుంచి సందేహం వ్యక్తమవుతోంది. మరి జడ్పీ పీఠం ఆశించిన ఆ కుటుంభానికి జగన్ మొండిచెయ్యి చూపించారా ! అనే భావన కూడా వ్యక్తమవుతోంది. బొత్స కుటుంబంలో బొత్స అప్పలనర్శయ్య, బొత్స సందీప్, లక్ష్మణరావు ఉంటుండుగా వీరిని పక్కన పెట్టి బెల్లాన చంద్రశఖర్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎందుకిచ్చినట్లో అన్న చర్చ కూడా నడుస్తోంది.
---------