if Floods Strike? వరదొస్తే.. పనులెలా?
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:14 AM
"What Happens to the Works if Floods Strike?" పాలకొండ నగర పంచాయతీ తాగునీటి ప్రాజెక్టు పనులకు వరద ముప్ప పొంచి ఉంది. ప్రస్తుతం నాగావళి నది గర్భంలో ముమ్మరంగా ఇన్‌ఫిల్టర్ బావుల నిర్మాణం జరుగుతుంది. అయితే జిల్లాలో లేదా ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం ఏర్పడనుంది.
నాగావళి నదీ గర్భంలో ముమ్మరంగా ఇన్‌ఫిల్టర్ బావుల నిర్మాణం
ఇసుక గట్టు రక్షణగా నిలిచేనా..
వర్షాకాలంలో పనులు చేపట్టడంపై విమర్శలు
పాలకొండ, జూలై9(ఆంధ్రజ్యోతి): పాలకొండ నగర పంచాయతీ తాగునీటి ప్రాజెక్టు పనులకు వరద ముప్ప పొంచి ఉంది. ప్రస్తుతం నాగావళి నది గర్భంలో ముమ్మరంగా ఇన్‌ఫిల్టర్ బావుల నిర్మాణం జరుగుతుంది. అయితే జిల్లాలో లేదా ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురిస్తే పనులకు ఆటంకం ఏర్పడనుంది. ఏదేమైనా వర్షాకాలంలో ఈ పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగర పంచాయతీవాసుల తాగునీటి కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. ఈ మేరకు రూ.72 కోట్ల ఏఐఐబీ నిధులు మంజూరు చేసింది. దీంతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోపాలపురం సమీపంలోని నాగావళి నదీ గర్భంలో మూడు ఇన్‌ఫిల్టర్ వెల్స్ నిర్మాణంతో పాటు ప్రధాన పైపులైన్లు, పట్టణంలో నాలుగు రక్షిత పథకాలు, డిస్ర్టిబ్యూషన్ పైపులైన్ల ఏర్పాటుకు వీలుగా పనులు చేపడుతున్నారు. కాగా గత నెల 21న ఇన్‌ఫిల్టర్ వెల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పనులు ప్రారంభించడంతో వరద ముప్పు పొంచి ఉందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
వాస్తవంగా ఈ నెల 15వ తేదీకి ఇన్‌ఫిల్టర్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పనులు మరింత ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు పడితే ఇక అంతే సంగతి. వరదనీరు అధికంగా ఇన్‌ఫిల్టర్‌లోకి చేరుతుంది. ఇసుక చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే పనులు మళ్లీ మొదటికి వస్తాయి. వాస్తవంగా ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకొని ఏకాలంలోనే మూడు ఇన్‌ఫిల్టర్ బావుల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అయితే వరద భయంతో పనులు జరుగుతున్న ప్రాంతం చుట్టూ ఇసుకను గట్టుగా ఏర్పాటు చేశారు. వరదల సమయంలో ఇది ఏ మేరకు రక్షణగా నిలుస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా నగర పంచాయతీకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన తాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్‌కు దిశానిర్దేశం చేశారు. అయితే జూలై నెలాఖరకు ఇన్‌ఫిల్టర్ బావుల పనులు పూర్తవుతాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పాలకొండ నగర పంచాయతీ వాటర్ సప్లై ఏఈ బంగార్రాజును వివరణ కోరగా.. ‘ప్రస్తుతం నాగావళి నదిలో ఇన్‌ఫిల్టర్ బావుల నిర్మాణం జరుగుతుంది. వరద ముప్పు తట్టుకుని.. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.’ అని తెలిపారు.