ఏపీ సేవా పోర్టల్‌కు ఏమైంది?
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:50 PM
అవసరమైన ధ్రువపత్రాలు పొందేందుకు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారికి ఇక్కట్లు తప్పడం లేదు.
- ధ్రువపత్రాల కోసం ప్రజలకు తప్పని పాట్లు
- దరఖాస్తు చేసినా మంజూరు కావట్లే
- ‘వాట్సాప్ గవర్నెన్స్’లో కనిపించని దరఖాస్తులు
జియ్యమ్మవలస, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): అవసరమైన ధ్రువపత్రాలు పొందేందుకు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారికి ఇక్కట్లు తప్పడం లేదు. జనన, కుల, ఆదాయం, ఈడబ్ల్యూఎస్, 1బీ, అడంగళ్ పొజిషన్, క్యారెక్టర్, ఎఫ్‌ఎంసీ వంటి సర్టిఫికెట్లు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఏపీ సేవా పోర్టల్‌లో అవసరమైన ధ్రువపత్రాలు పొందే అవకాశం లేక, ఇటు వాట్సాప్ గవర్నెన్స్‌లో చేసుకున్న దరఖాస్తులు అధికారుల లాగిన్‌లో కనిపించక సమస్యలు ఏర్పడుతున్నాయి. అసలు ఏపీ సేవా పోర్టల్ ఉందా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
2022లో వైసీపీ సర్కారు ఏపీ సేవా పోర్టల్ పేరుతో 540 రకాలకు పైగా ధ్రువపత్రాలను జారీ చేసేది. ఏదైన ధ్రువపత్రం కోసం ఒకసారి దరఖాస్తు చేసుకుంటే చాలు, మరోసారి దరఖాస్తు అవసరం ఉండేది కాదు. తగిన రుసుం తీసుకొని సంబంధిత ధ్రువపత్రం వెనువెంటనే పొందే వెసులుబాటు ఉండేది. ఏపీ సేవా పోర్టల్ ద్వారా విద్యుత్‌శాఖకు సంబంధించి 53, రెవెన్యూశాఖ 30, మున్సిపల్ 25, పౌర సరఫరాలశాఖ 6, గ్రామీణాభివృద్ధి శాఖ 3.. ఇలా అన్ని శాఖలకు సంబంధించి 541 సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీ సేవా పోర్టల్ కొనసాగిస్తూనే మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని వాట్సాప్ గవర్నెన్స్‌ను తెరపైకి తీసుకువచ్చింది. మనమిత్ర పేరుతో వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రారంభించింది. అయితే, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికెట్లు పొందేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మెజార్టీ ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన ధ్రువపత్రాల కోసం ఇందులో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారుల పోర్టల్‌లో ఆ దరఖాస్తులు కనిపించడం లేదని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. మన మిత్రలో ఏ ధ్రువపత్రం కోసమైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సంబంధిత మొబైల్ ఫోన్‌లోనే యూపీఐ యాప్‌ల ద్వారా రుసుం చెల్లించాలి. అంతేకాకుండా ప్రతీసారి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. గతంలో ఏపీ సేవా పోర్టల్‌లో ఒకసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది. కావాల్సినప్పుడల్లా రెన్యూవల్ చేసి ధ్రువపత్రాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో సర్టిఫికెట్లు పొందేందుకు పాట్లు పడాల్సి వస్తుంది. మన మిత్ర వెబ్‌సైట్ పై ప్రజలు, ఉద్యోగులకు పూర్తి అవగాహన వచ్చే వరకు ఏపీ సేవా పోర్టల్‌ను కొనసాగించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.