ఏమైందిరా అర్పితూ!
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:22 AM
ఏమైందిరా అర్పితూ.. నీకు ఏం కష్టం వచ్చిందిరా బిడ్డా. మొన్ననే కదా ఫోన్ చేశాము. ‘బాగున్నాను నాన్నా’ అని ఆనందంగా చెప్పావు కదరా.
-ఏకలవ్యలో గిరిజన విద్యార్థి ఆత్మహత్య
-వసతిగృహం గది కిటికీకి ఉరి వేసుకుని..
-అనుమానాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
-ప్రిన్సిపాల్ సస్పెన్షన్, విధుల నుంచి వార్డెన్, కుక్ తొలగింపు
-విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తాం: మంత్రి గుమ్మిడి ప్రకటన
‘‘ఏమైందిరా అర్పితూ.. నీకు ఏం కష్టం వచ్చిందిరా బిడ్డా. మొన్ననే కదా ఫోన్ చేశాము. ‘బాగున్నాను నాన్నా’ అని ఆనందంగా చెప్పావు కదరా. అంతలోనే ఏమైంది నీకు? మాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా బిడ్డా. అమ్మానాన్న ఉన్నారని కూడా అనుకోలేదా?’’ అంటూ ఆ కన్నవారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు అక్కడున్న వారి గుండెలను పిండేసింది. ఐదు రోజుల క్రితం సరదాగా ఫోన్‌లో మాట్లాడిన తండ్రికి బై చెప్పిన ఆ 12 ఏళ్ల చిన్నారి.. అంతలోనే నిర్జీవమై కనిపించడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు.
మాకు అనుమానం ఉంది
మా కుమారుడి మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. మాకు అనుమానంగా ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి.
- అర్పిత్ తండ్రి రాంబాబు
మక్కువ/సీతంపేట/బెలగాం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న సవర అర్పిత్(12)అనే గిరిజన విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌లోని తన గదిలో కిటికీకి తువ్వాలు కట్టిఉరేసుకున్నాడు. అయితే, కుమారుడి మృతిపై తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. వినాయక చవితి కోసం ఇంటికి వచ్చిన తన బిడ్డను రెండు రోజల కిందటే పాఠశాలకు దిగబెట్టానని, ఇంతలో మృతి చెందాడని సమాచారం అందిందని రోదిస్తున్నాడు. మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ, తహసీల్దార్ భానుప్రసాద్ ఏకలవ్య పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఘటన గల కారణాలను విద్యార్థులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ప్రిన్సిపాల్ ఏమంటున్నారంటే..
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అర్పిత్ ఉదయం రెండు పిరియడ్లు తరగతికి హాజరయ్యాడు. అనంతరం టిఫిన్ కోసం విద్యార్థులను పంపించగా, అర్పిత్ టిఫిన్ చేయడానికి రాలేదు. కొంతసేపటి తర్వాత అర్పిత్ గది లోపల గడి పెట్టుకున్నాడని సహచర విద్యార్థులు తెలిపారు. వెంటనే వెళ్లి వెనుకవైపు నుంచి వెళ్లిచూడగా గదిలో కిటికీకి తువ్వాలతో ఉరివేసుకొని కొనఊపిరితో కనిపించాడు. వెంటనే డోకిశిల పీహెచ్‌సీకి తీసుకెళ్లాం. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాం. అర్పిత్ మార్గమధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు.’అని అన్నారు.
అనుమానాలు ఉన్నాయంటున్న తండ్రి..
సీతంపేట మండలం కోడిశ పంచాయతీ ఎర్రన్నగూడ గ్రామానికి చెందిన సవర రాంబాబు, చామంతి దంపతులకు కుమార్తెలు జ్యోతి, ప్రీతి, కుమారుడు అర్పిత్ ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 11న అనసభద్ర ఏకలవ్య పాఠశాల నుంచి అర్పిత్‌ను తండ్రి రాంబాబు ఇంటికి తీసుకువచ్చాడు. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపాడు. వినాయక చవితిని ఇంటివద్ద జరుపుకొన్నారు. పండగ అనంతరం ఈ నెల 15న ఉదయం అర్పిత్‌ను తండ్రి పాఠశాలకు దిగబెట్టాడు. ఆ సమయంలో అర్పిత్ ఆనందంగానే ఉన్నాడని తండ్రి రాంబాబు చెబుతున్నాడు. అయితే, రెండు రోజుల్లోనే అర్పిత్ విగతజీవిగా మారడాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రిలో కుమారుడి మృతదేహంపై పడి తల్లి చామంతి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. తమ కుమారుడి మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని తండ్రి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అర్పిత్ మృతితో ఎర్రన్నగూడలో విషాదచాయలు అలముకున్నాయి.
సమగ్ర దర్యాప్తు చేయాలి
గిరిజన విద్యార్థి అర్పిత్ అనుమనాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి ఆ కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లు గంగునాయుడు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు కె.రామస్వామి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుప త్రి ఆవరణలో విద్యార్థి కుటుంబం సభ్యులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కాలంలో విద్యాలయాల్లో విద్యార్థుల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దానికి గల కారణాలను శాస్త్రీయంగా పరిశీలించి దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తరచూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణులతో నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చూడాలని, హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రి సంధ్యారాణి దిగ్ర్భాంతి
పార్వతీపురం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): అర్పిత్ ఆత్మహత్య చేసుకోవడంపై గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వార్డెన్ ఎ.మహేశ్వరరావు, కుక్ జ్యోత్స్నను పూర్తిగా విధుల నుంచి తొలగించారు. ప్రిన్సిపాల్ సురేష్‌ను సస్పెండ్ చేశారు. ఈమేరకు టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ (గురుకులం) సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లల సంరక్షణపై నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు.