ఏం జరిగిందో?
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:28 AM
రాత్రి మంచంపై నిద్రపోయిన వ్యక్తి తెల్లారేసరికి తీవ్ర గాయాలతో కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొంతసేపటికే మృతి చెందాడు.
- వేపాడలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
- ముఖంపైన బలమైన దెబ్బలు
- అన్నికోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు
వేపాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాత్రి మంచంపై నిద్రపోయిన వ్యక్తి తెల్లారేసరికి తీవ్ర గాయాలతో కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొంతసేపటికే మృతి చెందాడు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రాత్రి ఏం జరిగింది.? ఆ వ్యక్తిపై ఎవరైనా దాడి చేశారా? లేదా మరేదైనా కారణం ఉందా? అనేది దర్యాప్తులో తేలనుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ గ్రామంలోని రెడ్డి వీధికి చెందిన రెడ్డి గణేష్ తాపీపనులు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. గణేష్‌కు గతంలో వివాహమైంది. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయి ఎవరికి వారే ఉంటున్నారు. గణేష్, అతని తండ్రి అప్పారావు నిత్యం మద్యం తాగుతూ ఒకరికొకరు గొడవులు పడుతుండేవారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో గణేష్ తన ఇంట్లోని మంచంపై పడుకున్నాడు. తల్లి ఎరుకులమ్మ తన ఇంటికి దగ్గర్లో ఉన్న పెద్ద కొడుకు ఇంట్లో నిద్రపోయేందుకు వెళ్లింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు తన ఇంటికి చేరుకునే సరికి కుమారుడు గణేష్ మంచంపై కొనఊపిరితో సృహ లేకుండా ఉన్నాడు. ఆయన ముఖంపై బలమైన రక్తపు గాయాలు ఉండడంతో గట్టిగా కేకలు వేసింది. ఇరుగు పొరుగు వారిని పిలిచి అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఎస్.కోట ఆస్పత్రికి తరలించింది. గణేష్‌కు వైద్యులు చికిత్స అందిస్తుండగా కొంత సమయానికి మృతి చెందాడు. తన కొడుకు హత్యకు గురయ్యాడని తల్లి ఎరుకులమ్మ వల్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్.కోట రూరల్ సీఐ హిమగిరి ఆధ్వర్యంలో జిల్లా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలు గ్రామానికి చేరుకుని ఆధారాలు సేకరించడంతో పాటు విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకు కారణమైన వారిని పట్టుకుంటామని సీఐ తెలిపారు.