ఏమైందో ఏమో?
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:14 AM
గజపతినగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బొత్స రాజేష్(17) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
-ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గజపతినగరం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): గజపతినగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బొత్స రాజేష్(17) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాలలోని హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వివరాలను ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామానికి చెందిన రాజేష్ గజపతినగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. గురువారం సాయంత్రం కళాశాల వదిలిన తరువాత ఆరు గంటల సమయంలో హాస్టల్‌లోని తన గదికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. 6.30 గంటలకు తోటి విద్యార్థులు స్టడీక్లాస్‌కు వెళ్లగా.. రాజేష్ మాత్రం తనకు నీరసంగా ఉందని వారికి చెప్పి ఉండిపోయాడు. స్టడీ క్లాస్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు తలుపుకొట్టగా రాజేష్ తీయలేదు. దీంతో తలుపునకు ఉన్న చిన్న రంధ్రంలో నుంచి చూడగా రాజేష్ వేలాడుతూ ఉండటాన్ని గమనించారు. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లి చూసే సరికి సిస్టమ్ కేబుల్ వైర్‌తో ఉరేసుకుని ఉన్నాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. రాజేష్ తండ్రి బొత్స లక్ష్మణరావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేష్ మృతిపై తల్లిదండ్రులు గాని, బంధువులు గాని ఎటువంటి అనుమానాలు వ్యక్త పర్చలేదన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్‌ఐ అన్నారు.