ఏమైందో?
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:58 PM
విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి వి.వెంకటఉదయతేజ (19) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
- జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- మృతుడిది విశాఖపట్నం
విజయనగరం క్రైం/రూరల్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి వి.వెంకటఉదయతేజ (19) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన ఉదయతేజ ఇంజనీరింగ్(ఈఈఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే తోటి విద్యార్థులతో గడిపాడు. ఉదయం అల్పాహారం తీసుకోలేదు. కళాశాలకు వెళ్లకుండా ఒక్కడే వసతి గృహంలోని తన గదిలో ఉన్నాడు. ఈ సమయంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వసతి గృహానికి వచ్చిన తోటి విద్యార్థులు ఉదయతేజ ఉన్న గదికి తలుపులు వేసి ఉండడాన్ని గమనించారు. గది తలుపులు తీసినా రాకపోవడంతో లోపల నిద్రపోయి ఉంటాడని ఉదయతేజ సెల్‌ఫోన్‌కు కాల్ చేశారు. అయినా, లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి విద్యార్థులు, వసతిగృహ నిర్వహకులు తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్లగా ఉదయతేజ ఫ్యానుకి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని కళాశాల అధికారులకు తెలియజేశారు. వారి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి శ్రీనివాసరావు, తల్లి శుక్రవారం రాత్రి జేఎన్‌టీయూకి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత చదువులు చదివి తమకు తోడుగా ఉంటాడని ఎన్నో కలలు కన్నామని, ఇంతలోనే కొడుకు మరణం జీర్ణించుకోలేకపోతున్నామని వారు రోదించడం అక్కడి వారిని కలిచివేసింది. ఉదయతేజ ఆత్మహత్య గల కారణాలు తెలియడం లేదని, గత రెండు రోజుల నుంచి తన వాట్సాప్ స్టేటస్‌లో ఉరివేసుకునే చిత్రాలను పెట్టేవాడంటూ తోటి విద్యార్థులు చెప్పారని రూరల్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.