Share News

Mom ఆ పసికందుకు ఏం తెలుసు.. అమ్మ లేదని.. తిరిగి రాదని!

ABN , Publish Date - Oct 06 , 2026 | 10:52 PM

What Does That Little One Know… That Mom Is Gone and Won’t Return? తొలికాన్పులోనే పండంటి మగబిడ్డ పుట్టడడంతో ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. తన చిన్నారి ముఖం చూసి .. అప్పటివరకు భరించిన పురిటి నొప్పులను సైతం మరిచిపోయింది. సాధారణ ప్రసవమే జరగడంతో ఎందో ఆనందంతో బిడ్డతో కలిసి ఆసుపత్రి నుంచి పుట్టింటికి చేరింది. అయితే పసిబిడ్డతో ఎంతో సంతోషంగా ఉన్న ఆతల్లిపై విధి చిన్నచూపు చూసింది. ఏమైందో ఏమో కాని.. నెలరోజుల్లోనే ఆ బాలింత మృత్యుఒడిలోకి చేరింది.

  Mom  ఆ పసికందుకు ఏం తెలుసు.. అమ్మ లేదని.. తిరిగి రాదని!
లక్ష్మి (ఫైల్‌)

  • ప్రసవించిన నెల రోజుల్లోనే మృత్యుఒడికి ..

  • తల్లిపాల కోసం చూస్తున్న పసికందు

  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

  • ఆకు పసరు పట్టడమే కారణమా?

  • క్షేత్రస్థాయిలో కొరవడిన వైద్య సిబ్బంది పర్యవేక్షణ

  • పాచిపెంట మండలంలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..

సాలూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తొలికాన్పులోనే పండంటి మగబిడ్డ పుట్టడడంతో ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. తన చిన్నారి ముఖం చూసి .. అప్పటివరకు భరించిన పురిటి నొప్పులను సైతం మరిచిపోయింది. సాధారణ ప్రసవమే జరగడంతో ఎందో ఆనందంతో బిడ్డతో కలిసి ఆసుపత్రి నుంచి పుట్టింటికి చేరింది. అయితే పసిబిడ్డతో ఎంతో సంతోషంగా ఉన్న ఆతల్లిపై విధి చిన్నచూపు చూసింది. ఏమైందో ఏమో కాని.. నెలరోజుల్లోనే ఆ బాలింత మృత్యుఒడిలోకి చేరింది. దీంతో అమ్మ తిరిగి రాదని తెలియక.. ఆ బిడ్డ తల్లి పాల కోసం ఏడుస్తూ కుటుంబ సభ్యులు, స్థానికులను కంటతడి పెట్టిస్తున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన పాచిపెంట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పాచిపెంట మండలం పాంచాలి పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామం జీలుగువలసకు చెందిన కొర్రా లక్ష్మికి అదే మండలం బొర్రమామిడికి చెందిన సింహాచలంతో ఏడాది కిందట వివాహమైంది. అయితే గర్భం దాల్చిన లక్ష్మికి నెలలు నిండడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. ఆగస్టు 30న సాలూరు ఏరియా ఆసుపత్రిలో చేరింది. సాధారణ ప్రసవం జరగ్గా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాలు ఎంతో సంతోషించాయి. అయితే బిడ్డతో కలిసి లక్ష్మి తిరిగి పుట్టింటికి వెళ్లింది. నెల రోజుల పాటు బిడ్డతో కలిసి ఎంతో ఆనందంగా ఉన్న బాలింతకు ఏమైందో ఏమో గాని ఈ నెల మూడో తేదీ నుంచి ఒంటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక బంధువులు పసరుమందు ఇప్పించారు. అయితే ఆ వైద్యం వికటించడంతో లక్ష్మి పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే సమీపంలో ఉన్న గురువినాయుడుపేట పీహెచ్‌సీకి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సీపీఆర్‌ చేశారు. లక్ష్మి కాస్త స్పృహాలోకి వచ్చిన తర్వాత సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు సుమారు రెండు గంటల పాటు బాలింతకు వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విజయనగరం ఎంఆర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ శనివారం లక్ష్మి మృతి చెందింది. దీంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ప్రధానంగా తల్లి లేని పసిబిడ్డను చూసి భోరున విలపిస్తున్నారు.

తప్పెవరిది?

గిరిజన గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై తప్పెవరిది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలపై పూర్తిగా దృష్టి సారించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ, ఆశ, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌, ఏఎన్‌ఎంపై ఉంది. అదేవిధంగా సమీప వైద్యులు , క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు నోడల్‌ ఆఫీసర్‌ కూడా పర్యవేక్షించాల్సి ఉంది. ప్రసవం తర్వాత బాలింతలను అప్రమత్తం చేస్తూ.. ఆరోగ్య స్థితిపై అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాల్సి ఉంది. అయితే క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించక పోవడం వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మతా, శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బాధాకరం

బొర్రమామిడికి చెందిన లక్ష్మి ఆగస్టు 30న సాలూరు ఏరియా ఆసుపత్రిలో సాధారణ ప్రసవంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయితే డిశ్చార్జి అయిన నెల రోజుల తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాలింతను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఏ ఆకు పసరు పట్టించారో కానీ అప్పటికే శరీరంలో ఉన్న అనేక అవయవాలపై ఆ ప్రభావం పడింది. అయినప్పటికీ తగు చికిత్స అందించాం. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఎంఆర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశాం. ఏదేమైనా గిరిజన బాలింత మృతి చెందడం బాధాకరం.

- నాగేశ్వరరావు, సూపరింటెండెంట్‌, సాలూరు ఏరియా ఆసుపత్రి

Updated Date - Oct 06 , 2026 | 10:52 PM