What does it matter to us?ఏమైతే మాకేంటి?
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:05 AM
What does it matter to us? ఇసుకపై అజమాయిషీ చేస్తూ ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతూ.. గుట్టుగా తరలిస్తూ.. ప్రభుత్వ స్థలాల్లోనే నిల్వ చేస్తూ.. అధిక ధరకు విక్రయిస్తూ.. జేబులు నింపుకోవడానికి అలవాటు పడిన ఇసుకాసురుల ఆగడాలు జిల్లాలో ఏమాత్రం తగ్గడం లేదు. వారి అత్యాశ వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతున్నా లెక్కచేయడం లేదు.
ఏమైతే మాకేంటి?
నదులపై పడుతున్న ఇసుకాసురులు
వారు తవ్విన ప్రాంతాల్లో ప్రమాదాలు
వాటిలో పడి బలవుతున్న మూగజీవాలు
గోస్తనీలో దెబ్బతింటున్న ఊటబావులు, వంతెనలు
పట్టించుకోని అధికారులు
ఇసుకపై అజమాయిషీ చేస్తూ ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతూ.. గుట్టుగా తరలిస్తూ.. ప్రభుత్వ స్థలాల్లోనే నిల్వ చేస్తూ.. అధిక ధరకు విక్రయిస్తూ.. జేబులు నింపుకోవడానికి అలవాటు పడిన ఇసుకాసురుల ఆగడాలు జిల్లాలో ఏమాత్రం తగ్గడం లేదు. వారి అత్యాశ వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతున్నా లెక్కచేయడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో ఇసుక కోసం తవ్విన గోతుల్లో మూగజీవాలు చిక్కుకుని మృత్యువాత పడిన ఘటనలు వెలుగుచూశాయి. వంతెనల పక్కన తవ్వేసి బ్రిడ్జిలను అభద్రతలో పడేస్తున్న ఘటనలూ కోకొల్లలు. ఊటబావులదీ అదే పరిస్థితి.
ఎస్.కోట రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ తవ్వకాలు అనేక విపత్కర పరిణామాలకు దారితీస్తున్నాయి. మూగజీవాలు బలైపోతున్నాయి. జామి మండలంలోని తానవరం పరిసర ప్రాంతాలతో పాటు ఎస్.కోట మండలం కొట్టాం, గోపాలపల్లి, వేములాపల్లి, గోపాలపల్లి, మామిడిపల్లి గోస్తనీ తీరంలో ఇసుక కోసం తీసిన గోతులు ఊబిలా మారి ఇటీవల పదులసంఖ్యలో మూగజీవాలను బలి తీసుకున్నాయి. రైతులకు చెందిన పశువులతోపాటు ఇసుక రవాణాకు వెళ్తున్న టైరుబళ్లకు కట్టిన పశువులు ఆ ఊబిలో దిగి కూరుకుపోయి చనిపోతున్నాయి.
- ఇసుక దొంగల ధన దాహానికి గోపాలపల్లి వంతెన ఇప్పటికే ప్రమాదస్థితికి చేరుకుంది. ఈపిల్లర్ల కింద ఇసుకన పెద్దఎత్తున సేకరిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 200 నాటుబళ్లను గోస్తనీలో దించి ఇసుకను సేకరిస్తున్నారు. ఆపై ఒకదగ్గర పోగులా వేసి ట్రాక్టర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక కోసం ఇసుక దొంగలు టైరుబళ్లకు రూ.రెండు వేలు ఇచ్చి వీరు రవాణా చేసే ప్రాంతం బట్టి రూ.3,500వరకు విక్రయిస్తున్నారు. ఊటబావులు, వంతెనల వద్ద తవ్వకాలు చేపట్టకూడదని అధికారులు పదేపదే చెబుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వేములాపల్లి, గోపాలపల్లి, మామిడిపల్లి, కొట్టాం ప్రాంతాల్లో ఇసుక వ్యాపారం ఆరునాటుబళ్లు.. మూడు ట్రాక్టర్లగా సాగుతోంది. రోజుకు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఇసుక కోసం వారు తవ్వించిన పెద్దపెద్దగోతుల్లో నాటుబళ్లను దింపడంతో మూగజీవాలు మునిగిపోయి ఊపిరి ఆడక దయనీయస్థితిలో చనిపోతున్నాయి. ఇక ఊటబావుల వద్ద తవ్వకాలతో గోస్తనీ నుంచి గ్రామాలకు వచ్చే నీరు కలుషితమవుతోంది. ప్రజలకు వ్యాధుల ముప్పు పొంచి ఉంది.
మనుషులకూ ముప్పు
గోపాలపల్లి వంతెన కింద ఇసుక తవ్వకాల కోసం తవ్విన గోతులను గుర్తించని చాలా మంది ఇందులో దిగి మృతిచెందుతున్నారు. గడిచిన ఐదేళ్లకాలంలో ఆరుగురు వరకు గోస్తనీలో ఈతకు దిగి ఊబిలో చిక్కుకుని మరణించారు. వెలుగు చూడని ఘటనలెన్నో.
ఫిర్యాదులు చేస్తున్నా..
గోస్తనీ తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలతో వంతెన, ఊటబావులతో పాటు గోస్తనీ తీరాన్ని ఆనుకొని వున్న పంటభూములు, పండ్లతోటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులంటున్నారు. దీనిపై వేములాపల్లి,ధర్మవరం గ్రామస్థులు హైకోర్టులో కేసు కూడా వేశారు. అయినా అధికారులు అటు చూడడం లేదు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసిన సమయంలో మాత్రం మైన్స్ అధికారులు ఈప్రాంతానికి వచ్చి ఇసుక తవ్వేవారిని హెచ్చరించి వెళ్లిపోవడం మినహా కఠిన చర్యలు లేవు. పోలీస్, రెవెన్యూ అధికారులు అక్రమ తవ్వకాల ఊసే మరిచారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో గోస్తనీ నదిని ఆనుకొని వున్న ప్రజలకు ఇబ్బందులు, అపాయాలు తప్పవేమో. వంతెన కింద ఇసుక తవ్వకాలు ఆపకపోతే ఎప్పుడైనా కూలుతుందని చుట్టుపక్కల వారు భయపడుతున్నారు.
----------------------------------