Share News

ఏం తేల్చారో?

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:50 PM

భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై గత రెండు నెలల్లో రెండుసార్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. పలు రికార్డులతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

  ఏం తేల్చారో?
భోగాపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

- భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై రెండుసార్లు ఏసీబీ దాడులు

- అధికారులు, సిబ్బందిలో ఏమైనా మార్పు వచ్చిందా?

- చర్చించుకుంటున్న ప్రజలు

భోగాపురం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై గత రెండు నెలల్లో రెండుసార్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. పలు రికార్డులతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, దాడుల తరువాత ఏసీబీ ఏం తేల్చింది.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు, సిబ్బందిలో మార్పు ఏమైనా వచ్చిందా?.. వారిపై చర్యలు తీసుకుంటారా? లేదా? అనే విషయాలపై సర్వాత్రా చర్చనడుస్తోంది. గతేడాది నవంబరు 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృత తనికీలు నిర్వహించారు. విలువైన రికార్డులతో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకొని కార్యాలయ అధికారులు, సిబ్బంది, బ్రోకర్లు, దస్తావేజు లేఖర్లపై నిఘా పెట్టారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు ఆ పరిసరాల్లో కొన్ని రోజుల పాటు నిశ్శబ్దం నెలకొంది. దస్తావేజు లేఖర్ల కూడా తమ షాపు షట్టర్లను తెరిచేవారు కాదు. తరువాత నెమ్మదిగా పరిస్థితి యథాస్థితికి చేరుకుంది. అయితే, గతేడాది డిసెంబరు 23న ఏసీబీ అధికారులు మరోసారి భోగాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. సబ్‌రిజిస్ట్రార్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, సిబ్బంది, ఓ ప్రైవేటు వ్యక్తి ఇళ్లపై ఏక కాలంలో దాడులు నిర్వహించి విస్తృత తనికీలు చేపట్టారు. కార్యాలయానికి చెందిన కొంతమంది అధికారుల వద్ద కొంత నగదు గుర్తించగా, ప్రైవేట్‌ వ్యక్తి ఇంట్లో భారీ నగదు, బంగారం, వెండిని ఏసీబీ గుర్తించింది. రెండోసారి ఏసీబీ దాడులతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో కొన్నిరోజుల పాటు కార్యాలయం ఏరియా అంతా బోసిపోయింది. డాక్యుమెంట్‌ రైటర్లు తమ దుకాణాలు తెరవకపోవడం, కక్షిదారులు వచ్చినా దస్తావేజులు తయారు చేయకపోవడం జరిగేది. అయితే, రానురానూ పరిస్థితి మారి కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా దస్తావేజులేఖర్లు, కక్షిదారులతో భోగాపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం కళకళలాడుతోంది. అయితే రెండుసార్లు ఏసీబీ దాడులు జరిగాయి కదా.. ఏం తేలింది? అంతా బాగానే ఉందా? అని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వస్తున్న వారంతా చర్చించుకోవడం ప్రతిరోజూ కనిపిస్తోంది. ఎక్కడ విన్నా ఇవే మాటలు, ఇవే సంభాషణలు. ఇప్పటికైనా అధికారులు, సిబ్బందిలో మార్పు వస్తే మంచిదని అంటున్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:50 PM