మా వాళ్లను ఒడిశా పోలీసులు ఏం చేశారో?
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:54 PM
What Did the Odisha Police Do to Our People? ‘ ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ.. కొఠియా గ్రూప్ గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు వారిని ఏం చేశారో చెప్పడం లేదు.. ఇప్పటివరకు వారి ఆచూకీ కూడా చెప్పడం లేదు. మా వాళ్లను తిరిగి మాకు అప్పగించాలి.’ అని ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కోరారు. ఈ మేరకు మంగళవారం సాలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కొఠియా గిరిజనుల ఆందోళన
సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
సాలూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘ ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ.. కొఠియా గ్రూప్ గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు వారిని ఏం చేశారో చెప్పడం లేదు.. ఇప్పటివరకు వారి ఆచూకీ కూడా చెప్పడం లేదు. మా వాళ్లను తిరిగి మాకు అప్పగించాలి.’ అని ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కోరారు. ఈ మేరకు మంగళవారం సాలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ పోలీసులు చొరవ తీసుకోవాలని కొఠియా గ్రామాలకు చెందిన గెమ్మల అనిల్, చోడిపల్లి దబ్బులు, గెమ్మెల బాసనా తదితరులు కోరారు. తమ కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరేలా చూడాలన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో దిగువశెంబి గ్రామానికి చెందిన వ్యక్తిని తీసుకుపోయి పోలింగ్ తరువాత విడిచిపెట్టారని వారు తెలిపారు. తాజాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమ గ్రామాలకు చెందిన గిరిజనులను ఒడిశా పోలీసులు తీసుకుపోయారని వెల్లడించారు. దీనిపై అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదని, డిసెంబరులో జరగనున్న సర్పంచ్ ఎన్నికల తరువాత తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టేలా ఉన్నారని వాపోయారు. ఒడిశా పోలీసులు తీసుకెళ్లిన గిరిజనులు తిరిగి తమ గ్రామాలకు వచ్చేలా చేయాలని రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజ్‌ను కోరారు.
ఆ గిరిజనులు విడుదలయ్యేలా చూడండి : మంత్రి ఆదేశం
ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసిన కొఠియా గిరిజనులు తక్షణం విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులను మంగళవారం ఆదేశించారు. ఒడిశా పోలీసుల అదుపులో ఉన్న గిరిజనులను విడిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం న్యాయవాదులను కూడా ఏర్పాటు చేశామన్నారు. కొఠియా గ్రామాలకు చెందిన గిరిజనులను విడిచిపెట్టే వరకు తాము ఊరుకోబోమని, అన్ని దారులనూ అన్వేషిస్తానని తెలిపారు.