What decision will be taken! ఏ నిర్ణయం తీసుకుంటారో!
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:10 AM
What decision will be taken! ఈ ఏడాది సంకిలి సుగర్‌ఫ్యాక్టరీలో క్రషింగ్ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమయ్యేలా కనిపిస్తోంది. కనీసం రెండున్నర లక్షల టన్నుల చెరకు లేకుంటే వచ్చే ఏడాది క్రషింగ్ ఎలా చేపడతామని యాజమాన్యం నిరాసక్తత చూపుతోంది.
ఏ నిర్ణయం తీసుకుంటారో!
చెరకు పంట మనుగడ, రైతుల ఆందోళనపై రేపు కీలక సమావేశం
మంత్రి కొండపల్లి, కలెక్టర్, ఎమ్మెల్యేల భేటీ
భరోసా లేక ఇతర పంటల సాగుకు మొగ్గుతున్న రైతులు
ఈ ఏడాది సంకిలి సుగర్‌ఫ్యాక్టరీలో క్రషింగ్ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమయ్యేలా కనిపిస్తోంది. కనీసం రెండున్నర లక్షల టన్నుల చెరకు లేకుంటే వచ్చే ఏడాది క్రషింగ్ ఎలా చేపడతామని యాజమాన్యం నిరాసక్తత చూపుతోంది. సంకిలి ఫ్యాక్టరీ వచ్చే ఏడాది క్రషింగ్ చేయకపోతే తామెందుకు చెరకును పండించాలన్న ధోరణిలో రైతులున్నారు. ఈ గందరగోళ పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 31న మంత్రి కొండపల్లి, కలెక్టర్, ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
బొబ్బిలి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో చెరకు పంట మనుగడపై రైతుల్లో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఈ నెల 31న కలెక్టర్ నేతృత్వంలో కలెక్టరేట్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, సంకిలి ఫ్యాక్టరీ యాజమాన్యం సంయుక్త సమావేశం జరుగనుంది. లచ్చయ్యపేట ఎన్‌సీఎస్, భీమసింగి సహకారం చక్కెర కర్మాగారాలు మళ్లీ తెరుచుకొని చెరుకు క్రషింగ్ చేస్తాయన్న ఆశలు పూర్తిగా ఆవిరైపోయిన నేపథ్యంలలో రైతులంతా చెరకు పంట సాగునుంచి తప్పుకుంటున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, ఇతర ఉద్యాన, వాణిజ్యపంటల సాగువైపు మొగ్గుచూపుతు న్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన చెరకు రైతులు అరకొరగా పండించిన చెరకు పంటను క్రషింగ్ కోసం సంకిలి ఫ్యాక్టరీకి పంపుతున్నారు. ఈ ఏడాది సంకిలి ఈఐడీ ఫ్యాక్టరీలో 2.40లక్షల టన్నుల చెరకును క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతవరకు 99 వేల టన్నుల చెరకును క్రషింగ్ చేయగలిగారు. చోడవరం ప్రాంతం నుంచి 40 వేల టన్నుల వరకు చెరకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా కూడా ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. కనీసం రెండున్నర లక్షల టన్నుల చెరకు లేకుంటే వచ్చే ఏడాది క్రషింగ్ ఎలా చేపడతామని యాజమాన్యం నిరాసక్తత చూపుతోంది. సంకిలి ఫ్యాక్టరీ వచ్చే ఏడాది క్రషింగ్ చేయకపోతే తామెందుకు చెరకును పండించాలన్న ధోరణిలో రైతాంగం ఉన్నారు. ఈ గందరగోళపరిస్ధితుల నుంచి క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపైనే మంత్రి కొండపల్లి, కలెక్టరు, ఎమ్మెల్యేలు కలిసి శనివారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
31న విజయనగరంలో సమావేశం
ఎం.సత్యనారాయణ, డిప్యూటీ కేన్ కమిషనర్, బొబ్బిలి
వచ్చే ఏడాది చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 31 న మంత్రి, కలెక్టరు, పలువురు ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరుగనుంది. సంకిలి ఫ్యాక్టరీ క్రషింగ్‌కు అవసరమైన చెరకు పంటను రైతులు పండించేలా ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించాల్సి ఉంది. గతంలో ఫ్యాక్టరీ పరంగా పలు పథకాలు ఉండేవి. సాగునీటి పైపులు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, ముందస్తు వడ్డీ లేని రుణాలు వంటివి ఉండేవి. వాటిని మళ్లీ పునరుద్ధరించాలని చెరకు రైతుసంఘాల వారు రైతుల తరపున కోరుతున్నారు. ఈ అంశాలన్నింటిపై జిల్లా పెద్దలు, అధికారులు చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తారు.