Share News

what are you doing మీరేం చేస్తున్నారు?

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:36 AM

what are you doing ప్రతిరోజూ నేను ప్రజల కోసం అహర్నిశలూ పనిచేస్తున్నాను, మీరంతా ఇదే స్పీడును అందుకోకపోతే ఎలా?’అంటూ విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

what are you doing మీరేం చేస్తున్నారు?

మీరేం చేస్తున్నారు?

- నేను 18 గంటలు పనిచేస్తున్నా..

- జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు

- స్థానిక పరిస్థితులపై లోతుగా సమీక్ష

- సర్వే నివేదికలను బహిర్గతం చేసిన అధినేత

- ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరుపై పెదవి విరుపు

- పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తేవద్దని హెచ్చరిక

విజయనగరం ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి):

‘ప్రతిరోజూ నేను ప్రజల కోసం అహర్నిశలూ పనిచేస్తున్నాను, మీరంతా ఇదే స్పీడును అందుకోకపోతే ఎలా?’అంటూ విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బుధవారం రాత్రి 8.30 నుంచి 10.30 గంటల వరకు రెండు గంటల పాటు సమీక్షించారు. అందరి పనితీరుపై పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై సీఎం పెదవి విరిచినట్లు సమాచారం. వారిలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నట్లు భోగట్టా. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఇతర ముఖ్య నేతలు, కలెక్టర్‌, ఎస్పీతో తొలుత ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై చర్చించారు.

అనంతరం ఒక్కో ఎమ్మెల్యే, ఎంపీ పనితీరుకు సంబంధించి తన వద్దనున్న నివేదికలు, సర్వే వివరాలను వారి ముందు ఉంచారు. కొంతమందిపై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చే విధంగా వ్యవహారళైలి ఉండకూడదని హెచ్చరించారు. ఓ ప్రజా ప్రతినిధిని ఉద్దేశిస్తూ భూ వివాదాలలో వేలుపెడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహ రించడం ఏమిటి? పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆయనతో పాటు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల తీరుపట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. భర్తలు పరిపాలనలో కలుగచేసుకుని పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమచారం. పనితీరు బాగున్న వారిని ప్రశంసిస్తూ, బాగాలేని వారికి అక్షింతలు వేశారు. ప్రజల మనసులు దోచుకునేలా అందరి పనితీరు ఉండాలని హితవు పలికారు.

- అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రాథమ్యాలపై ఆరా తీశారు. అత్యవసరంగా నిధులు విడుదల చేయాల్సిన అంశాలు, పనులపై ప్రజాప్రతి నిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రజాహితమైన ప్రాజెక్టులపై సుదీర్ఘంగా సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ఎటువంటి భేషజాలకు పోరాదని సూచించారు. ప్రజాప్రతినిధులకు తెలియకుండా బంధువులు గాని, అనుచరులు గాని తప్పులు చేస్తే వాటి ప్రభావం కచ్చితంగా ప్రభుత్వంపై పడుతుందని, ఎవరు ఎప్పుడు దొరుకుతారా? అని ప్రత్యర్థులు డేగకళ్లతో వెతుకుతున్న సంగతిని విస్మరించరాదని చెప్పారు. అలాంటి వారికి ఎటువంటి అవకాశం దొరక్కుండా పారదర్శకంగా ప్రజాసేవలో ఉండాలన్నారు. నెల్లూరు తరహాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లాకు సంబంధించి ముఖ్యమైన ప్రాజెక్టులు, పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులంతా కలిసి సీఎంకు వినతిపత్రం అందజేశారు.

కీలక నిర్ణయాలు

- రామతీర్థం రాములవారి విగ్రహం విధ్వంసం ఘటనకు సంబంధించిన ఉద్యమ కేసులను ఎత్తివేయాలన్న ముఖ్యమంత్రి

- రామతీర్థం ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆదేశం

- చీపురుపల్లి వందపడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి సీఎం అంగీకారం

-విజయనగరంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేలా మంత్రి నారాయణతో మాట్లాడాలని అధికారులకు సీఎం ఆదేశం

- భోగాపురం ఎయిర్‌పోర్టు నేపథ్యంలో రోడ్ల నిర్మాణం ఏవిధంగా చేపట్టాలో ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి

- కొత్తగా చేపట్టబోయే ఖరగ్‌పూరల్‌-అమరావతి జాతీయ రహదారిపై చర్చ. దీంతో విజయనగరం జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం వ్యాఖ్య. జలధార సక్సెస్‌ చేయాలని, గత ప్రభుత్వం సృష్టించిన 22 ఏ కేసులు పరిష్కరించాలని ఆదేశించారు.

- విజయనగరం-నెల్లిమర్లను కలుపుతూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డికి ఆదేశం. అలాగే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రత్యేకంగా అభినందించారు.

సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, కోళ్ల లలితకుమారి, ఆర్‌వీఎస్‌కెకె రంగారావు (బేబీనాయన), అదితి గజపతిరాజు, కోండ్రు మురళీమోహన్‌, లోకం నాగమాధవి, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

-----------------

Updated Date - Apr 09 , 2026 | 12:36 AM