కుంకీలు ఏం చేస్తున్నాయో?
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:11 AM
కుంకీల రాకతో.. దశాబ్దాలుగా వేధిస్తున్న గజరాజుల సమస్యకు తెరపడనుందని జిల్లా వాసులు ఆనందపడ్డారు.
- జిల్లాలో యథేచ్ఛగా సంచరిస్తున్న అడవి ఏనుగులు
- రెండు నెలలుగా కుంకీలతో ఆపరేషన్
- అయినా ఫలితం శూన్యం
- ఒడిశా నుంచి తిరిగి వచ్చేస్తున్న గజరాజులు
- శాశ్వత పరిష్కారమెప్పుడో?
పార్వతీపురం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కుంకీల రాకతో.. దశాబ్దాలుగా వేధిస్తున్న గజరాజుల సమస్యకు తెరపడనుందని జిల్లా వాసులు ఆనందపడ్డారు. జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులను కుంకీలతో అడివిలోకి లేదా ఎలిఫెంట్ జోన్‌కు తరలిస్తారని.. ఇక ఆస్తి, పంట, ప్రాణ నష్టాలు ఉండవని సంతోషపడ్డారు. కానీ, వారి ఆశలు అడియాసలవుతున్నాయి. కుంకీలు జిల్లాకు చేరుకుని రెండు నెలలు దాటినా అడవి ఏనుగుల బెడద మాత్రం వదలడం లేదు. ఎప్పటిలాగే అవి జనావాసాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. వాటిని అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు కుంకీలతో చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఆపరేషన్ ఎప్పుడు పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందో, ఏనుగుల సమస్య శాశ్వతంగా ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇదీ పరిస్థితి..
ప్రస్తుతం పార్వతీపురం డివిజన్‌లో ఎనిమిది, పాలకొండ డివిజన్‌లో నాలుగు ఏనుగులు సంచరిస్తున్నాయి. వీటివల్ల ఈ ప్రాంతలవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు తోటలు, పంట పొలాల్లో సంచరించే గజరాజులు ప్రస్తుతం రహదారులు, జనావాసాల్లో తిరుగుతుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. అవి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే గజరాజుల దాడిలో 13 మంది మృతి చెందారు. సుమారు 3,811 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఏనుగుల కట్టడికి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రత్యేక వాహనాల్లో జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులను ఈ ఏడాది జూలై నెలాఖరులో అటవీశాఖ అధికారులు ఇక్కడకు తీసుకొచ్చారు. కుంకీల సహాయంతో జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులను అడవిలోకి లేదా గుచ్చిమి రిజర్వ్‌ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ జోన్‌లోకి తరలించేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఆర్థిక భారంతో కూడిన కార్యక్రమం అయినప్పటికీ ప్రజల రక్షణ దృష్ట్యా ప్రభుత్వం వెనుకాడలేదు. అయితే, రెండు నెలలుగా ఆపరేషన్ చేపడుతున్నా ఏనుగులను మాత్రం జిల్లా నుంచి కదలడం లేదు. పలు ప్రాంతాల్లో తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రత్యేక లక్ష్యంతో ఏనుగులను తరలింపు ఆపరేషన్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. తూతూ మంత్రంగా నిర్వహిస్తే ప్రభుత్వ లక్ష్యం నీరుగారే అవకాశం ఉంది.
రోజుకు రూ.8వేల ఖర్చు..
రెండు కుంకీ ఏనుగుల ఆహారం కోసం రోజుకు రూ.7వేల నుంచి రూ.8వేలవరకు అధికారులు ఖర్చు చేస్తున్నారు. వాటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెరకు గడలు, పనసకాయలు, అరటి పండ్లు, తదితర సీజనల్ పండ్లతో ప్రత్యేక ఆహారం అందిస్తున్నారు. కుంకీలకు అవసరమైన వైద్య పరీక్షలు, విశ్రాంతి, శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఏనుగుల సంరక్షణ కేంద్రంలో సుమారు పదిమంది సిబ్బంది ఉన్నారు.
ఒడిశా నుంచి తరిమేస్తున్నారు..
గతంలో ఒడిశా అధికారులతో రాష్ట్ర అటవీశాఖాధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సంయుక్తంగా ఏనుగులను కాపాడుకుంటూ, వాటివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆ నిర్ణయాలు ప్రకటనలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులు ఒడిశా నుంచి వచ్చాయి. వాటిని తిరిగి కేర్ ట్రాకర్ల ద్వారా ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లోకి పలుమార్లు జిల్లా అధికారులు పంపించారు. అయితే, ఆ రాష్ట్ర అటవీ అధికారులతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు బాంబులు వేసి, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఇతర ప్రయోగాలు చేపట్టి ఏనుగులను మళ్లీ మన్యం జిల్లాలోకి తరిమేస్తున్నారు. దీనిబట్టి ఒడిశా అధికారులు ఏ విధంగా ఏనుగులను వారి ప్రాంతాల్లోకి రాకుండా నివారిస్తున్నారో స్పష్టమవుతుంది.
ఆపరేషన్ విజయవంతంగా నిర్వహిస్తాం..
జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులను అటవీ ప్రాంతానికి లేదా సంరక్షణా కేంద్రానికి తరలించేందుకు ఇప్పటికే కుంకీలతో ఆపరేషన్ ప్రారంభమైంది. ఇటీవల ఒడిశా అడవుల వైపు ఏనుగులను తరలించాం. కానీ, తిరిగి వాటిని అక్కడివారు మన జిల్లాలోకి తరిమేశారు. అయినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేవిధంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహిస్తాం.
-మణికంఠేష్, ఏనుగుల సంరక్షణాధికారి, పార్వతీపురం మన్యం