Share News

what about our path?సూత్రధారి సరే.. మా దారేదీ?

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:43 PM

what about our path? ‘లక్ష రూపాయలు డిపాజిట్‌ చేయండి.. 500 రోజుల్లో రెట్టింపు డబ్బులు మీ సొంతమవుతాయి’ అంటూ నమ్మబలికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేలాదిమంది నుంచి రూ.కోట్లు వసూలుచేసి, బోర్డు తిప్పేసిన హార్వెంచర్స్‌ ఇన్‌ఫ్రా సూత్రధారి పడిల్‌ సోమశేఖర్‌ ఎట్టకేలకు గాజువాక పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలో బాధితుల్లో న్యాయం జరుగుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో ఆ సంస్థ బాధితులు వేలాదిగా ఉన్నారు.

what about our path?సూత్రధారి సరే.. మా దారేదీ?
గతంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం

సూత్రధారి సరే.. మా దారేదీ?

ఎట్టకేలకు చిక్కిన ‘హార్వెంచర్స్‌’ ప్రతినిధి

అరెస్టు చేసిన గాజువాక పోలీసులు

న్యాయం చేయాలని వేడుకొంటున్న బాధితులు

మీ పరిధి స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అట్నుంచి సలహా

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు

అంగుళం కూడా ముందుకు సాగని దర్యాప్తు

న్యాయ నిపుణులను సంప్రదిస్తున్న డిపాజిట్‌దారులు

‘లక్ష రూపాయలు డిపాజిట్‌ చేయండి.. 500 రోజుల్లో రెట్టింపు డబ్బులు మీ సొంతమవుతాయి’ అంటూ నమ్మబలికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేలాదిమంది నుంచి రూ.కోట్లు వసూలుచేసి, బోర్డు తిప్పేసిన హార్వెంచర్స్‌ ఇన్‌ఫ్రా సూత్రధారి పడిల్‌ సోమశేఖర్‌ ఎట్టకేలకు గాజువాక పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలో బాధితుల్లో న్యాయం జరుగుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో ఆ సంస్థ బాధితులు వేలాదిగా ఉన్నారు.

మెంటాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పశ్చిమబెంగాల్‌కు చెందిన పడాల సోమశేఖర్‌ విశాఖకు వలసవచ్చి గాజుకవాకలో నివాసముంటూ మర్రిపాలెంలో ఎనిమిదేళ్ల క్రితం హార్వెంచర్స్‌ ఇన్‌ఫ్రా అనే సంస్థను నెలకొల్పాడు. ఎండీగా ఉంటూ తాను రచించుకున్న ఆర్థిక వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించాడు. పేద, మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక భరోసా తమ సంస్థ లక్ష్యమంటూ నమ్మబలికాడు. లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే రోజుకు 444 రూపాయలు చొప్పున వరుసగా 500 రోజులపాటు ఖాతాల్లో జమచేస్తామని చెప్పుకొచ్చాడు. కొంతమందిని టీమ్‌గా నియమించుకుని వసూళ్ల పర్వం నడిపించాడు. ఉత్తరాంధ్రలోని పలుచోట్ల కార్యాలయాలు తెరచి వేలాదిమంది నుంచి డిపాజిట్లు సేకరించి, కొన్నాళ్లపాటు అనుకున్న ప్రకారం డబ్బులు జమచేస్తూ వారిద్వారా మరికొందరిని ఖాతాదారులుగా చేర్చుకొన్నాడు. పెద్దమొత్తంలో డబ్బు పోగయ్యాక బోర్డు తిప్పేసారు. టీమ్‌ లీడర్లు, సంస్థ పెద్దలు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అప్పటికి గానీ మోసపోయామని ఖాతాదారులు గుర్తించలేకపోయారు. జిల్లాలో వందల కోట్ల రూపాయలను డిపాజిట్ల కింద సేకరించినట్టు అప్పట్లోనే గుప్పుమంది. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతిలో ‘నమ్మించి.. రూ.కోట్లు కొట్టేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. బాధితులు న్యాయం కోసం తమ పరిధిలోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో, వారిలో కొంతమంది ఆయా జిల్లాల ఎస్పీలను సంప్రదించారు. హోంమంత్రి అనితకు గోడు వినిపించుకోవడం వంటివి జరిగినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. బాధితులు మాత్రం పట్టువీడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వివిధ రూపాల్లో పోరు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. వేలాదిమంది జీవితాలతో ఆడుకున్న ఆ డిపాజిట్‌ దందా ప్రధాన సూత్రధారి పడాల సోమశేఖర్‌ను గాజువాక పోలీసులు ఈనెల 3న అదుపులోకి తీసుకున్నారు.

- బాధితుల్లో సామాన్యులే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలా మంది రూ.లక్షల్లో డిపాజిట్‌ చేశారు. భూములు అమ్మి కొందరు, బంగారాలు తెగనమ్మి కొందరు, భారీ వడ్డీలకు అప్పులువాడి ఇంకొందరు, తమకు తెలిసిన వారి ద్వారా ఇంకొందరు రూ.కోట్లలో జమచేశారు. సూత్రధారి పోలీసులకు చిక్కాడని తెలుసుకుని గాజువాక పోలీసులను సంప్రదించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మీమీ పరిధిలోని పోలీసులను కలవాలని అట్నుంచి సమాధానం రావడంతో ఏం చేయాలో పాలుపోక బాధితులు లబోదిబోమంటున్నారు.

- బాధితుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సంస్థ ఏర్పాటు చేసిన కొందరు దళారులు ఇప్పుడు మధ్యవర్తిత్వం నెరపుతున్నారు. యాజమన్యాం ఎంతోకొంత ఇస్తుందని, దీంతో సంతృప్తి చెంది ఇక్కడితో ఈ కథ ముగించేయాలని రాయ ’బేరాలు’ సాగించడం గమనార్హం. సొమ్ముకు తగిన సరుకులు ఇస్తారని కూడా నమ్మబలుకుతున్నారు. సంస్థకు ఆస్తులు వున్నాయని, కోర్టులు, స్టేషన్‌లకు వెళ్తే చిల్లిగవ్వ రాదని బెదిరిస్తున్నారు.

మళ్లీ మోసం

ఇంతచేసి ఇన్ని వేలమందిని నిలువునా ముంచేసిన ఆ వ్యక్తి ఇటీవల కొత్త అవతారం ఎత్తినట్టు సమాచారం. ఏటీసీ ఆగ్రో ఇండస్ట్రీ అనే సంస్థను తెరపైకి తెచ్చి ఎప్పట్లాగే టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అక్కయపాలెం కేంద్రంగా వ్యాపారం సాగిస్తూ, ఇంకొందరిని ఆ ఊబిలోకి లాగుతున్నాడు. ఇప్పటికే కొందరిని బుట్టలో వేసినట్టు కూడా చెబుతున్నారు.

చివరి ప్రయత్నం

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్థిక నేరాల విభాగం (ఎకనమికల్‌ అఫెన్స్‌ వింగ్‌)ను ఆశ్రయించేందుకు బాధితులు నిర్ణయించారు. న్యాయ నిపుణులను సంప్రదించి వారి ద్వారా తమకు జరిగిన అన్యాయాన్ని ఆ విభాగానికి వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.25 లక్షలు తీసుకొని ముంచేశారు

హార్వెంచర్స్‌ టీమ్‌ లీడర్ల మాటలు నమ్మి రూ.25 లక్షలు డిపాజిట్‌ చేస్తే, ఒక్క రూపాయి కూడా వెనక్కి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. టీమ్‌ లీడర్లను అడిగితే నీకు దిక్కున దగ్గర చెప్పుకో అని కటువుగా సమాధానం చెబుతున్నారు.ప్రభుత్వమే న్యాయం చేయాలి.

ఆనంద్‌, బాధితుడు జామి గ్రామం.

రూ.20 లక్షలకి టోకరా

సంస్థ ప్రచారాన్ని నమ్మి బంగారం అమ్మేసి రూ.27 లక్షలు డిపాజిట్‌ చేస్తే రూ.7 లక్షలు వెనక్కివచ్చాయి. నా భర్త ఆరోగ్యం బాగోలేదని, కనీసం రూ.50 వేలు సర్దుబాటు చేయాలని స్వయంగా ఎండీ కి ఫోన్‌ చేసి ప్రాధేయపడినా కనికరించలేదు.

భవానీ, బాధితురాలు, సచివాలయం ఉద్యోగి, కొత్తూరు,శ్రీకాకుళం జిల్లా

హోం మినిస్టర్‌ హామీ ఇచ్చినా..

నా భర్తకు క్యాన్సర్‌ సోకింది. అంతకుముందే రూ.పది లక్షలు డిపాజిట్‌ చేశాను.భర్త పరిస్థితి చెప్పి బతిమాలినా ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు నా భర్త ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. హోం మినిస్టర్‌ అనితను విజయనగరంలో కలిసి మా గోడు విన్నవించుకున్నాం. నా బుజం తట్టి మరీ ఆమె హామీ ఇచ్చారు. ఐదు నెలలు అవుతోంది న్యాయం జరగలేదు.

రమణమ్మ, బాధితురాలు, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా

Updated Date - Oct 06 , 2026 | 11:43 PM