What a Tragedy! హతవిధీ!
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:10 AM
What a Tragedy! భామిని మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. పిడుగుపాటుకు గురై ఓ యువకుడు.. చెట్టు కూలడంతో గిరిజన యువతి మృతి చెందారు.
పిడుగుపాటుకు యువకుడు.. చెట్టు కూలి యువతి మృతి
భామిని, జూన్15(ఆంధ్రజ్యోతి): భామిని మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. పిడుగుపాటుకు గురై ఓ యువకుడు.. చెట్టు కూలడంతో గిరిజన యువతి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేటకు చెందిన పి.రాజశేఖర్(20) తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. నెల రోజుల కిందట భామిని మండలం సొలికిరిలో అంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. కాగా సోమవారం వంశధార నది తీరంలో స్థానిక యువతతో కలిసి రాజశేఖర్ క్రికెడ్ ఆడాడు. ఇంతలో వాతావరణం మారడంతో ఇంటికి పయనమయ్యాడు. అయితే మార్గమధ్యలోనే పిడుగుపడడంతో ఆ యువకుడు స్పృహ కోల్పో యాడు. వెంటనే స్థానికులు యువకుడిని బాలేరు పీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే రాజశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. ఈ వార్త తెలిసి హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వారు అక్కడి నుంచి బయల్దేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చెట్టు మీద పడడంతో..
ఇప్పమానుగూడకు చెందిన సింగారు, బంగారిలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగి స్తున్నారు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా వారిలో చిన్నకుమార్తె అయిన ఆరిక సుప్రియ (17) సీతంపేటలో ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంటిలోనే ఉంటోంది. మామిడి పండ్ల కోసమని సోమవారం మధ్యాహ్నం సుప్రియ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని తోటకెళ్లింది. తిరిగి వస్తుండగా బూరిజ చెట్టు ఆమె మీద పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సుప్రియను కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 వాహనంలో సీతంపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రెఫర్ చేశారు. అయితే మార్గమధ్యలోనే సుప్రియ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. గ్రామంలోనూ విషాదచాయలు అలముకున్నాయి. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేశామని బత్తిలి ఎస్‌ఐ కె.రవీంద్ర తెలిపారు. శ్రీకాకుళం, సీతంపేట ఆసుపత్రుల్లో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.