Share News

Wetting.. drying తడుస్తూ.. ఎండుతూ

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:49 PM

Wetting.. drying మిల్లర్లు సేకరించిన ధాన్యం త్వరగా మిల్లింగ్‌ కాక పాడవుతున్నాయి. మంచుకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ దెబ్బతింటున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మిల్లింగ్‌ ప్రక్రియలో భాగంగా బియ్యంలో కలపాల్సిన కెర్నల్స్‌ ప్రభుత్వం నుంచి అందకపోవడమే ఈ పరిస్థితికి కారణం. త్వరగా మిల్లింగ్‌ చేయలేక మిల్లర్లు స్టాకు ఉంచేశారు. అవి మంచుకు దెబ్బతింటున్నాయి. గోనెసంచులు రంగు మారిపోయాయి.

Wetting.. drying తడుస్తూ.. ఎండుతూ
గంట్యాడ మండలంలోని ఓ రైసు మిల్లులో ధాన్యం బస్తాలకు నాచు

తడుస్తూ.. ఎండుతూ

పాడవుతున్న ధాన్యం

మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు

ప్రభుత్వం నుంచి మిల్లర్లకు సరఫరా కాని కెర్నల్స్‌

మందగించిన మిల్లింగ్‌ ప్రక్రియ

మిల్లర్లు సేకరించిన ధాన్యం త్వరగా మిల్లింగ్‌ కాక పాడవుతున్నాయి. మంచుకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ దెబ్బతింటున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. మిల్లింగ్‌ ప్రక్రియలో భాగంగా బియ్యంలో కలపాల్సిన కెర్నల్స్‌ ప్రభుత్వం నుంచి అందకపోవడమే ఈ పరిస్థితికి కారణం. త్వరగా మిల్లింగ్‌ చేయలేక మిల్లర్లు స్టాకు ఉంచేశారు. అవి మంచుకు దెబ్బతింటున్నాయి. గోనెసంచులు రంగు మారిపోయాయి.

విజయనగరం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి సేకరించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే చేపట్టారు. రైతులకు కూడా బిల్లులు వెంటవెంటనే జమ అయ్యాయి. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం మరపట్టి అందులో కలపాల్సిన కెర్నల్స్‌(పోర్టుఫైడ్‌ బియ్యం) అనుకున్న స్థాయిలో రాలేదు. దీంతో మిల్లింగ్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల మిల్లింగ్‌ కనీస స్థాయిలో జరగలేదు. రైతుల నుంచి వచ్చిన ధాన్యానికి మరపట్టి మిల్లుర్లు సీఎంఆర్‌ను 45 రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. మిల్లుల వద్ద పెద్ద పెద్ద గుట్టులుగా ధాన్యం నిల్వ చేసి టార్పాలిన్లు కప్పి ఉంచారు. చాలా చోట్ల మిల్లుల వద్ద నిల్వ చేసిన ధాన్యం మంచుకు లేదా ఇతర కారణాల వల్ల దెబ్బతింటున్నాయి. అక్కడక్కడ మొలకలు వచ్చినట్లు కన్పిస్తున్నాయి. అయినా ప్రభుత్వం అందజేయాల్సిన కెర్నల్స్‌ ఇవ్వడం లేదు. దీంతో మిల్లింగ్‌ చేయలేకపోతున్నామని మిల్లర్లు వాపోతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు వారు వెల్లడిస్తున్నారు. నిల్వ చేసిన ధాన్యం దెబ్బతింటే ఆ బాధ్యతలను మిల్లర్లు తీసుకుంటారా? ప్రభుత్వం భరిస్తుందా? అనేది వారికే తెలియాలి.

జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 4 లక్షలు మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకూ 3 లక్షలు93 వేలు మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సేకరించిన ధాన్యానికి గాను రైతులకు డబ్బులు కూడా చెల్లించారు. సాధారణంగా క్వింటా ధాన్యం మర పట్టి మిల్లర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 67 కేజీలు బియ్యం ఇవ్వాల్సి ఉంది. దీనిని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సిఎంఆర్‌) అంటారు. మిల్లులకు ఇచ్చిన ధాన్యం ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1,18,000 మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌( సివిల్‌ సప్లయ్‌ సంస్ధకు) ఇవ్వాలి. 1,50,000 మెట్రిక్‌ టన్నులు ఎఫ్‌సీఐ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి ఇవ్వాల్సి ఉంది. సివిల్‌ సప్లయ్‌కి ఇస్తున్న బియ్యంకు కెర్నల్స్‌(పోర్టు ఫైడ్‌ బియ్యం) కలపాలి. క్వింటా బియ్యంకు ఒక కేజీ కెర్నల్‌ కలపాలని నిబంధనలు చెబుతున్నాయి. దీనిని పోర్టుఫైడ్‌ బియ్యంగా చెబుతారు. ఇటువంటి బియ్యంతో అన్నం తినడం వల్ల రక్తహీతన సమస్యలు దూరం అవుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఇచ్చే బియ్యంలో కెర్నల్స్‌ కలపాల్సిన అవసరం లేదు. సివిల్‌ సప్లయ్‌కు అందజేయాల్సిన సీఎంఆర్‌కు కలపాల్సిన కెర్నల్స్‌ ప్రస్తుతం జిల్లాలో లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రభుత్వం నుంచి ఇవి రాకపోవడంతో జిల్లాలోని బీఆర్‌ఎల్‌ (బిలో రిజక్షన్‌ లిమిటడ్‌ ) పరిధిలోని 19 మంది మిల్లర్లు మిల్లింగ్‌ ప్రకియను ముందుకు నడపలేకపోతున్నారు. వారంతా కెర్నల్స్‌ కోసం నిరీక్షిస్తున్నారు.

ఫ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్‌ అనుకున్నంత స్థాయిలో రావడం లేదు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా ఎఫ్‌సిఐకి దాదాపు 61,500 మెట్రిక్‌ టన్నులు, సివిల్‌ సప్లయ్‌ సంస్థకు 32 వేల మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఫ గతంలో కెర్నల్స్‌ను ఒకేసారి ప్రయోగం చేసి పంపించారు. ఇప్పుడు మూడు సార్లు ల్యాబ్‌లో పరీక్ష చేయాల్సి వస్తోంది. ఇవి కేంద్రం నుంచి రావాల్సి ఉంది. దీని వల్ల జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సివిల్‌ సప్లయ్‌ సంస్థ జిల్లా మేనేజరు శాంతి వద్ద ప్రస్తావించగా జిల్లాలో ఉన్న మిల్లులకు కెర్నల్స్‌ అందజేశాం. సీఎంఆర్‌ కూడా వస్తోందని చెప్పారు.

వెయ్యి టన్నుల కెర్నల్స్‌ అవసరం

జిల్లాకు సుమారు వెయ్యి టన్నుల కెర్నల్‌ రైస్‌ అవసరం. వాటిని తెప్పించేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం 100 టన్నుల పోర్టిఫైడ్‌ కెర్నల్స్‌ రానున్నాయి. వచ్చే వారం మరో 200 టన్నులు వస్తాయి. గతంలో ఎప్పుడు లేనివిధంగా 40 శాతం అధికంగా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 24 గంటల్లో రైతుల ఖాతాలకు నిధులు జమ చేశాం.

కొండపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ,

ఎన్‌ఆర్‌ఐ, సెర్ప్‌ వ్యవహారాల శాఖ మంత్రి

Updated Date - Feb 08 , 2026 | 11:49 PM