Share News

పొలం పనికి వెళ్లి..పాము కాటుకు గురై..

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:27 AM

బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకున్న కుమారుడు ఒక్కసారి మృతి చెందడంతో ఆ కుటుంబం అల్లాడి పోతోంది.

పొలం పనికి వెళ్లి..పాము కాటుకు గురై..
గొర్లె రాము (ఫైల్‌)

  • తల్లిముందే కుప్పకూలిన బాలుడు

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఫ తాణేంలో విషాదం

పొందూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకున్న కుమారుడు ఒక్కసారి మృతి చెందడంతో ఆ కుటుంబం అల్లాడి పోతోంది. ఇంటర్‌ చదువుతున్న ఆ విద్యార్థి కళాశాల నుంచి వచ్చి తమ పొలంలో పనులకు వెళ్లగా పాముకాటువేయడంతో మృతిచెందిన ఘటన బాణాం పంచాయతీ తాణేం గ్రామంలో శుక్రవారం సంభవించింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాణేం గ్రామానికి చెందిన గొర్లె అప్పన్న, లక్ష్మిలకు ఇంటర్‌ చదువుతున్న గొర్లె రాము(17), లక్ష్మణ కవలపిల్లలు కాగా కుమార్తె లిఖిత ఉన్నారు. అప్పన్న వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. శుక్రవారం రాము, లక్ష్మణ పొందూరు కళాశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికిచేరుకున్నారు. అల్పాహారం తిన్న రాము లోలుగు గ్రామానికి సమీపంలో ఉన్న తమ పొలంలో టమోటా నారు వేసేందుకు పొలంలో దిగాడు. పాము కాటు వేయడంతో పెద్దగా కేకలు పెట్టి కూలిపోయాడు. సమీపంలో ఉన్న అతని తల్లి లక్ష్మి గమనించి వెంటనే రామును రోడ్డు వద్దకు తీసుకువచ్చింది. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా అతడి తండ్రి అప్పన్న 108 వాహనాకి సమాచారం ఇచ్చారు. 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

108 వాహనం ఆగిపోవడంతో...

రామును తరలించిన 108 వాహనం ఆసుపత్రికి చేరే లోపు మార్గమధ్యలో మరమ్మతుకు గురికావడంతో కొద్దిసేపు నిలిచిపోయింది. తిరిగి వాహనం బయలుదేరి ఆసుపత్రికి చేరుకునేటప్పటికే ఆలస్యం కావడంతో రాము పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చేరిన రాముకు వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం కనిపించలేదు. కవల సోదరుడైన రాము మృతిచెందడంతో లక్ష్మణ, తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. రాము మృతిచెందాడన్న వార్తతో గ్రామంలో విషాదం అలముకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 19 , 2026 | 12:27 AM