Turned Lifeless! అప్పుడే పనులకు వెళ్లి.. అంతలోనే విగతజీవిగా మారి!
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:50 PM
Went to Work… and Within Moments, Turned Lifeless! సచివాలయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరిం చడానికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరలేదు. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.
సచివాలయానికి కరెంట్ సరఫరా పునరుద్ధరించే క్రమంలో ఘటన
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
సీతానగరం(బలిజిపేట),ఏప్రిల్12(ఆంధ్రజ్యోతి): సచివాలయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరిం చడానికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరలేదు. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెదపెంకి గ్రామానికి చెందిన ఎం.శంకరరావు(60)ప్రైవేట్ ఎలక్ర్టీషియన్‌గా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి వివాహం కాగా.. మరొకరు చదువుతున్నారు. అయితే రోజూలానే ఆదివారం ఆయన బయట పనులకు వెళ్లారు. సచివాలయ భవనానికి కరెంట్ లేదని సిబ్బంది చెప్పడంతో శంకరరావు అక్కడకి వెళ్లి పరిశీలించాడు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమా చారం అందించారు. బలిజిపేట ఎస్‌ఐ వై.సింహాచలం తన సిబ్బందితో ఆ ప్రాంతానికి చేరుకుని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శంకరరావు మృతదేహాన్ని పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య, కుమారులు కన్నీరు మున్నీరవుతున్నారు. పనులకని బయటకు వెళ్లిన శంకరరావు విగతజీవిగా మారడాన్ని జీర్ణించు కోలేకపోతున్నారు. ఇక తమకు దిక్కెవరని కుటుంబ సభ్యులు మృతదేహంపై పడి విలపించడంతో స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.