Share News

Returned Lifeless పొలంలో కలుపు తీయడానికి వెళ్లి.. విగతజీవులుగా మారి!

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:06 AM

Went to Weed the Field, Returned Lifeless పంట పొలంలో కలుపు తీసేందుకని వెళ్లిన ఆ మహిళలు తిరిగి ఇంటికి చేరుకోలేదు. పొలానికి వెళ్లిన కొద్దిసేపటికే విగతజీవులుగా మారారు. పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

  Returned Lifeless  పొలంలో  కలుపు తీయడానికి వెళ్లి.. విగతజీవులుగా మారి!
గొర్లె లక్ష్మి (ఫైల్‌), వారాడ రామలక్ష్మి (ఫైల్‌)

  • అవలంగి వెంకటాపురంలో ఘటన

  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

పాలకొండ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పంట పొలంలో కలుపు తీసేందుకని వెళ్లిన ఆ మహిళలు తిరిగి ఇంటికి చేరుకోలేదు. పొలానికి వెళ్లిన కొద్దిసేపటికే విగతజీవులుగా మారారు. పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పాలకొండ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

డోలమడ పంచాయతీ అవలంగి వెంకటాపురం గ్రామానికి చెందిన వారాడ రామలక్ష్మి (48), గొర్లె లక్ష్మి (65) ఒకే వీధిలో నివాసం ఉంటున్నారు. శనివారం సాయంత్రం పక్క పక్కనే ఉన్న తమ పంట పొలాల్లో కలుపు తీసేందుకు పయనమయ్యారు. వారు కలుపు తీస్తుండగా.. ఆకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే పిడుగుపడడంతో ఉన్నచోటే వారు కుప్పకూలిపోయారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న రైతు పోరాపు ఆదినారాయణ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. మహిళలు అచేతనంగా పడి ఉండడం చూసి వెంటనే గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం అందించాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పంట పొలానికి చేరుకొని విగతజీవులుగా పడి ఉన్న మహిళలను గ్రామంలోకి తరలించారు. సపర్యలు చేసేందుకు ప్రయత్నించగా అప్పటికే వారు మృతి చెందినట్టు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు గ్రామమంతా విషాదచాయలు అలుముకున్నాయి.

వారాడ రామలక్ష్మికి భర్త అప్పలనాయుడు, ఇద్దరు కుమారులున్నారు. వారు విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా కొన్ని సెంట్లు పొలం ఉన్నా రోజువారి వ్యవసాయ పనులకు వెళ్తే గాని పూటగడవని పరిస్థితి. అయితే వారికి ఉన్న కొద్ది పాటి పొలంలోని వరి వేశారు. పంటలో కలుపు పెరగడంతో దానిని తీసేందుకు రామలక్ష్మి బయల్దేరింది. అయితే పక్కపక్కనే పంట పొలాలు ఉండడంతో ఆమెకు తోడుగా గొర్లె లక్ష్మి కూడా బయల్దేరింది. పొలంలో పనులు చేస్తుండగానే పిడుగు పడడంతో ఇద్దరూ మృత్యువాతపడ్డారు. గొర్లె లక్ష్మికి భర్త జోగినాయుడు ఉన్నారు.

పెద్దకుమారుడికి పెళ్లి చేయాలని...

పెద్ద కుమారుడు గణేష్‌కు పెళ్లి చేయాలనే తలంపుతో తన భార్య ఉండేదని రామలక్ష్మి భర్త అప్పలనాయుడు విలపించాడు. వివాహ సంబంధాలపై ఆరా తీయమని కోరేదని.. ఇప్పుడు తానొక్కడినే ఏం చేయగలనని కన్నీటిపర్యంతమయ్యాడు.

ఒక్కరే అనుకున్నారు...

పిడుగుపాటుకు మృతి చెందింది ఒక్కరే అని తొలుత అంతా భావించారు. పొలం గట్టుపై గొర్లె లక్ష్మి మృతదేహం ఉండడంతో ఆమె ఒక్కరే చనిపోయారని గ్రామస్థులు అనుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత పంట పొలాల మీదుగా వెళ్తున్న రైతులు చేనులో చూడగా రామలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. వి.రామలక్ష్మి తన పొలంలో కలుపు తీస్తుండగా, గొర్లె లక్ష్మీ పంట పొలానికి వెళ్లేందుకు గట్టుపై నడుస్తుండగా ఈ ఘటన చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పాలకొండ ఎస్‌ఐ వెంకన్న గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయడం ద్వారా ప్రభుత్వ పరంగా ఆర్థికసాయం అందే అవకాశం ఉందని చెప్పారు. అయితే వారి కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. డిప్యూటీ తహసీల్దార్‌ రమేష్‌, వీఆర్‌వో తదితరులు గ్రామానికి చేరుకుని ఈ ఘటనపై వివరాలు సేకరించారు.

మంత్రి అచ్చెన్న సంతాపం

పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందడంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిబంధనల ప్రకారం తక్షణ సాయం అందిం చాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి కూడా తీవ్ర సంతాపం తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 12:06 AM