Returned Lifeless…! పొలాలకు వెళ్లి.. విగతజీవులుగా మారి..!
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:16 AM
Went to the Fields… Returned Lifeless…! జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పొలాలకు వెళ్లిన తమ వారు విగతజీవులు మారి తిరిగి ఇళ్లకు చేరడాన్ని జీర్ణించుకోలేకపోతు న్నాయి.
జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
సీతానగరం (బలిజిపేట), ఏప్రిల్6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పొలాలకు వెళ్లిన తమ వారు విగతజీవులు మారి తిరిగి ఇళ్లకు చేరడాన్ని జీర్ణించుకోలేకపోతు న్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వర్షం కారణంగా పంట తడిచిపోతుందనే కారణంతో బలిజిపేట మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన డి.సింహాచలమమ్మ (39) సోమవారం హుటా హుటిన బంధువుల పొలానికి వెళ్లింది. తమవారితో కలిసి మొక్కజొన్న పొత్తులపై టార్పాలిన్లు కప్పుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో సింహాచలమమ్మ అపస్మార స్థితికి చేరింది. స్థానికులు, కుటుంబ సభ్యులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం సింహాచలమమ్మ మృతదేహాన్ని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న ఆమె ఆకస్మిక మృతిని భర్త, ముగ్గురు పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.
- వంతరాం గ్రామానికి చెందిన వి.పార్వతమ్మ (40)తన భర్త వేణుగోపాలనాయుడుతో కలిసి ఉదయమే పొలానికి వెళ్లింది. సహాయకులు రమేష్, బాబూరావుతో కలిసి పంట ఏరివేత పనుల్లో నిమగ్నమై ఉండగా... సాయంత్రం వారున్న చోట పిడుగుపడింది. దీంతో పార్వతమ్మ , వేణుగోపాలనాయుడు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే అక్కడకు చేరుకుని హుటాహుటిన వారిని బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పార్వతమ్మ చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు. కాగా వేణుగోపాలనాయుడుతో పాటు సహాయకులిద్దరూ వైద్యసేవలు పొందుతున్నారు. పిడుగుపాటుకు తల్లి మరణించడంతో ఇద్దరు కూతుళ్లు, కుమారుడు భోరున విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బలిజిపేట ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.
మన్యంలో జోరువాన
పార్వతీపురం, ఏప్రిల్6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో జోరువాన కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగల శబ్దాలకు జనం బెంబేలెత్తిపోయారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండగా.. ఆ తర్వాత వాతావరణం మారింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత ఏకధాటిగా పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, పాచిపెంట, పార్వతీపురం, మక్కువ తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. సీతంపేట తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. కాగా దీంతో లోతట్టు ప్రాంతాలు మాత్రం జలమయమయ్యాయి. పలుచోట్ల పొలాల్లో నీరు చేరింది. ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచింది. కొద్దిసేపు వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్టు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలులకు కాయలన్నీ నేలరాలడంతో లబోదిబోమంటున్నారు. రానున్న రోజుల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో మామిడి,జీడి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా వాతావరణం చల్లబడడంతో ఎండ వేడి నుంచి జిల్లావాసులు కాస్త ఉపశమనం చెందారు.