Never Returned దసరా ఉత్సవాలకు వెళ్లి..తిరిగిరాని లోకాలకు
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:47 AM
Went to Attend Dasara Celebrations, Never Returned దసరా ఉత్సవాలు చూడడానికి వెళ్లిన యువకులు తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. తిరుగు ప్రయాణంలో వారి బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పండుగ వేళ మక్కువ మండలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఇద్దరి యువకుల మృతి
పండుగ పూట చప్పబుచ్చంపేటలో విషాదం
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
మక్కువ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాలు చూడడానికి వెళ్లిన యువకులు తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. తిరుగు ప్రయాణంలో వారి బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పండుగ వేళ మక్కువ మండలంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
చప్పబుచ్చింపేట గ్రామానికి చెందిన వైకుంఠపు గిరి (16), శివకోటి రవి(17) స్నేహితులు. పండుగ కోసం గిరి విశాఖ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గిరి తన మేనమామ బైక్ తీసుకుని రవితో మరో నలుగురు యువకులు ద్విచక్రవాహనాలపై మంగళవారం పాపయ్యవలసలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు బయల్దేరారు. అక్కడ వారంతా సరదాగా గడిపారు. వినోద, సాంస్కృతి కార్యక్రమాలను చూసి తిలకించిన అనంతరం అర్ధరాత్రి 2 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఒకే బైక్‌పై వస్తున్న గిరి, రవి వస్తుండగా.. కాశీపట్నం గ్రామ సమీపంలో వారి వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్‌స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ రోడ్డుకిరువైపులా చెల్లాచెదురుగా పడిపోయారు. గిరి, రవిలు ఎంతసేపటికి రాకపోయే సరికి తోటి యువకులు వెనుదిరిగి వెళ్లగా.. వెంగళరాయసాగర్ కాలువకు దగ్గరలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. వెంటనే వారు తమ గ్రామస్థులు, బాధితుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన చప్పబుచ్చింపేట వాసులు హుటాహుటిన బుధవారం వేకువజామున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న యువకులను చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. రవి ప్రమాద స్థలంలోనే మృత్యువాతపడగా.. గిరిని పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికందొచ్చిన బిడ్డలు అర్ధాంతరంగా చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి జ్ఞాపకాలను తలచుకుంటూ గుండెలవిసేలా రోదించారు. దసరా పండుగ రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
కుటుంబాల నేపథ్యం ఇదీ..
వైకుంఠపు గిరి విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో కోర్సు (మొదటి సంవత్సరం) చదువుతున్నాడు. ఆ యువకుడికి ఓ సోదరుడు, తల్లిదండ్రులు నరసంనాయుడు, చిన్నారి ఉన్నారు. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శివకోటి రవి మక్కువ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ద్వితీయ సంవత్సరం) చదువుతున్నాడు. రవికి సోదరుడిపాటు తల్లిదండ్రులు సోమేశ్వరరావు, సుబ్బలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డుప్రమాదం సమాచారం తెలుసుకున్న మక్కువ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు యువకుల మృతదేహాలను అప్పగిస్తామని మక్కువ పోలీసులు తెలిపారు.