Share News

Lost His Life ఆడుకోవడానికి వెళ్లి.. అనంతలోకాలకు

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:27 AM

Went Out to Play… Lost His Life తోటి స్నేహితులతో సరదాగా ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఆ బాలుడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. చెరువులోని గుంతలో చిక్కుకుని మృత్యువాతపడ్డాడు. దీంతో తల్లి, సోదరితో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 Lost His Life ఆడుకోవడానికి వెళ్లి.. అనంతలోకాలకు

భామిని, మార్చి 8(ఆంధ్రజ్యోతి): తోటి స్నేహితులతో సరదాగా ఆడుకోవడానికి బయటకు వెళ్లిన ఆ బాలుడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. చెరువులోని గుంతలో చిక్కుకుని మృత్యువాతపడ్డాడు. దీంతో తల్లి, సోదరితో పాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన భామిని మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సతివాడ గ్రామానికి చెందిన పునల్ల తేజ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బాలుడికి సరిగ్గా మాటలు రావు. రెండేళ్ల కిందట అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు. దీంతో తల్లి జయలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. కాగా ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఆడుకోవడం కోసం తేజ తోటి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అయితే కొద్దిసేపటి తర్వాత గ్రామ సమీపంలో చెరువు వద్దకు వెళ్లారు. కొందరు గ్రామస్థులు చేపలు పడుతుండడంతో వాటిని ఆసక్తిగా తిలకించారు. ఇంతలో తేజ చెరువు గట్టు వద్ద ఉన్న గుంతలో మునిగిపోయాడు. బాలుడు కేకలు వేయలేకపోవడంతో దీన్ని ఎవరూ గమనించలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత బాలుడు విగతజీవిగా బయటకు తేలాడు. దీన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. తల్లి, సోదరి అక్కడకు చేరుకుని తేజ మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అనంతరం గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - Mar 09 , 2026 | 12:27 AM