Share News

Went out to play... ఆడుకునేందుకు వెళ్లి..

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:01 AM

Went out to play... తన ఇద్దరు అక్కలు తోడు ఉండడంతో రోజూ ఆ వాటర్‌ టబ్బులోనే చిన్నారి కేరింతలు కొట్టేది. ముగ్గురూ కలిసి ఆడుకుంటున్నారన్న ధైర్యంతో తల్లిదండ్రులు కూడా తోట పనుల్లో ఉండేవారు. కానీ ఆ రాత్రి భద్రంగా చూసుకునే అక్కలు నిద్రలోకి జారిపోయారు.

Went out to play... ఆడుకునేందుకు వెళ్లి..
మృతి చెందిన చిన్నారి

ఆడుకునేందుకు వెళ్లి..

ఉసురుతీసిన వాటర్‌ టబ్‌

కారాడలో 18 నెలల చిన్నారి మృతి

బొబ్బిలి రూరల్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): తన ఇద్దరు అక్కలు తోడు ఉండడంతో రోజూ ఆ వాటర్‌ టబ్బులోనే చిన్నారి కేరింతలు కొట్టేది. ముగ్గురూ కలిసి ఆడుకుంటున్నారన్న ధైర్యంతో తల్లిదండ్రులు కూడా తోట పనుల్లో ఉండేవారు. కానీ ఆ రాత్రి భద్రంగా చూసుకునే అక్కలు నిద్రలోకి జారిపోయారు. తల్లిదండ్రులు ఫేన్‌ మరమ్మతుల్లో నిమగ్నమయ్యారు. ఒంటిరిగా బయటకు వెళ్తే ఆపద పొంచి ఉంటుందని పాపం ఆ చిన్నారికి తెలియదు. రోజూ ఆడుకునే టబ్బు వద్దకు వెళ్లింది. నీళ్లతో ఆడుకునేందకు ప్రయత్నించి అందులోకి జారిపోయింది. రెప్పపాటులో మునిగిపోయింది. కారాడ గ్రామం శివారులోని పామాయిల్‌ తోటలో ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. వాటర్‌ టబ్‌లో పడి 18 నెలల చిన్నారి మానస మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఒడిశాలోని రాయగడ ప్రాంతానికి చెందిన దంపతులు సుబరి బంధు, రాజకుమారి ఆరు నెలలుగా కారాడలో వీరభద్రరావుకు చెందిన పామాయిల్‌ తోటలో కూలీలుగా పనిచేస్తూ అక్కడే నివశిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మిల్లికి ఐదు సంవత్సరాలు, రెండో కుమార్తె సుమిత్రకు నాలుగేళ్లు, చిన్న కుమార్తె మానసకు 18 నెలల వయసు. బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి వలస వచ్చారు. పామాయిల్‌ తోట పనులు చేస్తుంటారు. పిల్లలు ముగ్గురూ ఇంటి వద్దే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌ పనిచేయకపోవడంతో తండ్రి దానిని బాగుచేసే పనిలో నిమగ్నమయ్యాడు. చిన్నారి తల్లి కూడా భర్తకు సహకారంగా ఇంట్లోనే ఉండిపోయింది. పెద్ద కుమార్తెలు నిద్రలోకి జారిపోయారు. చిన్నారి మానస ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లిపోయింది. వాటర్‌ టబ్‌లో దిగేందుకు ప్రయత్నించి అందులోకి జారిపోయింది. నిండా నీళ్లు ఉండడంతో మునిగిపోయింది. కొద్దిసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో వెతికిన తల్లిదండ్రులకు టబ్‌లో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారి కనిపించింది. వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొన్ని నిమిషాల ముందు వరకు తమతో ఆడుకున్న చిన్నారి అంతలోనే అచేతనంగా మారడంతో వారు తట్టుకోలేకపోయారు. చిన్నారి మృతిపై బొబ్బిలి పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేయగా హెచ్‌సీ పి.శ్రీనివాసరావు ప్రమాద మృతిగా సీఆర్‌పీసీ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ కె.నారాయణరావు తెలిపారు.

Updated Date - Jun 28 , 2026 | 12:01 AM