వేటకు వెళ్లి.. విగతజీవిగా మారి
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:52 PM
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు విగతజీవిగా మారాడు. నాటు పడవ నుంచి మడ్డువలస రిజర్వాయర్‌లోకి జారిపడడంతో ప్రాణాలు కోల్పోయాడు.
- మడ్డువలస రిజర్వాయర్‌లో మత్స్యకారుడి మృతి
- పడవ నుంచి జారిపడడంతో ప్రమాదం
- వంగరలో విషాదం
వంగర, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు విగతజీవిగా మారాడు. నాటు పడవ నుంచి మడ్డువలస రిజర్వాయర్‌లోకి జారిపడడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మత్స్యకారులు, పోలీసుల వివరాల మేరకు.. మండల కేంద్రం వంగరకు చెందిన ఎం.గణేష్(45) అనే మత్స్యకారుడు బుధవారం వేకువ జామున చేపల వేటకు నాటు పడవపై మడ్డువలస రిజర్వాయర్‌లోకి వెళ్లాడు. వలను నీటిలోకి విసిరి చేపలను పట్టే క్రమంలో పడవ నుంచి జారిపడిపోయాడు. కొంతసేపటి తరువాత అటుగా వెళ్లిన తోటి మత్స్యకారులకు గణేష్‌కు చెందిన నాటు పడవ ఖాళీగా కనిపించడాన్ని గుర్తించారు. దీంతో వారు గ్రామంలోకి వెళ్లి చెప్పారు. అధికారులు, పోలీసులకు కూడా సమాచారం అందించారు. మత్స్యకారులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టగా వలకు గణేష్ మృతదేహం చిక్కడంతో ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ రామారావు తెలిపారు.
ఇటీవలే చెన్నై నుంచి వచ్చాడు..
గణేష్ తన కుటుంబంతో చెన్నై వలస వెళ్లాడు. అక్కడ తాపీమేస్త్రిగా పని చేసేవాడు. అక్కడ పనులు దొరక్కపోవడంతో ఇటీవుల గ్రామానికి వచ్చాడు. గ్రామంలో కూడా సిమెంట్ పనులు లేకపోవడంతో బతుకు తెరువుకోసం చేపల వేట సాగిస్తున్నాడు. ఆయనకు భార్య జ్యోతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గణేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.