Electrical Work.. విద్యుత్ పనులకు సహాయకుడిగా వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
ABN , Publish Date - May 15 , 2026 | 11:47 PM
Went as an Assistant for Electrical Work.. Never Returned Home.. విద్యుత్ పనుల కోసం (జంగిల్ క్లియరెన్స్) సహాయకుడిగా వెళ్లిన గిరిజన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇంటి నుంచి బయల్దేరిన అరగంటలోనే విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
ఎర్రసామంతవలసలో విషాదచాయలు
మక్కువ రూరల్, మే15(ఆంద్రజ్యోతి): విద్యుత్ పనుల కోసం (జంగిల్ క్లియరెన్స్) సహాయకుడిగా వెళ్లిన గిరిజన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇంటి నుంచి బయల్దేరిన అరగంటలోనే విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. కాగా చేతికందొచ్చిన కుమారుడి అకాల మరణాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద ఘటన పనసభద్ర పంచాయతీ పరిధి ఎర్రసామంతవలసలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఎర్రసామంతవలసకు చెందిన పీడిక చిన్నప్ప, సాంబరమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇంటిలో చిన్నవాడైన నవీన్(24) ఇటీవల పదోతరగతి ఓపెన్ పరీక్షలు రాశాడు. గ్రామంలోనే చిన్నచిన్న విద్యుత్ మర మ్మతు పనులు చేసుకుంటూ.. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే రోజులానే శుక్రవారం విద్యుత్ పనుల కోసం బయటకు వెళ్లిన నవీన్ ఇంటికి తిరిగిరాలేదు.
ఎర్రసామంతవలస పరిసర ప్రాంతాల్లో విద్యుత్ తీగలపైన ఉన్న చెట్లు, కొమ్మలు తొలగించాలని దుగ్గేరు విద్యుత్‌ఫీడర్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది గొర్లె వెంకటరమణ, కొండతామర నవీన్ భావించారు. ఈ మేరకు సహాయకుడిగా నవీన్‌ను తమ వెంట తీసుకెళ్లారు. గ్రామంలోని పామాయిల్ తోట పక్కన విద్యుత్ లైన్‌పై పడి ఉన్న పామాయిల్ కొమ్మలను నవీన్ తొలగి స్తుండగా.. పొరపాటున చేతిలో ఉన్న కత్తి విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో నవీన్ ఒక్కసారిగా 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. వెంటనే సహచరులు, కాంట్రాక్టు సిబ్బంది అక్కడకు చేరుకోగా నవీన్ ఉలుకు పలుకు లేకుండా కనిపించాడు. అపస్మారక స్థితికి వెళ్లిన యువకుడిని హుటాహుటిన మక్కువ పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అయితే అప్పటికే నవీన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, సొదరుడు, సోదరి కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న నవీన్‌ను చూసి భోరున విలపించారు. ‘లే బిడ్డా ఇంటికెళ్దాం’ అంటూ వారు గుండెలవిసేలా రోదించడం చూసి స్థానికులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై విద్యుత్ శాఖ ఏఈ శంకరరావును వివరణ కోరగా.. ‘జంగిల్ క్లియరెన్స్ పనులకు సహాయకులుగా కొంతమందిని తీసుకెళ్తుంటాం. పనిని బట్టి రోజుకు రూ.500 నుంచి రూ. చెల్లిస్తాం. మృతి చెందిన గిరిజన యువకుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు గాను పై అధికారులకు నివేదిక పంపుతాం.’ అని తెలిపారు.