Gas problems: 25 కిలోమీటర్లు వెళ్లి..గ్యాస్ సిలిండర్లు తెచ్చుకుని
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:30 AM
Gas problems: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కష్టాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.
- వినియోగదారులకు తప్పని కష్టాలు
- బండ ధరతో కలిపి.. ఇంటికి తెచ్చేసరికి రూ.1600 ఖర్చు
- గ్రామాలకు సరఫరా చేయని ఏజెన్సీలు
భోగాపురం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కష్టాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. గతమూడు వారాలుగా గ్రామాలకు గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ సిలిండర్లను పట్టుకొని కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఒక బండను ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయాణ ఖర్చులతో కలిపి రూ.1600 అవుతుందని వినియోగదారులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
భోగాపురం మండలంలో 22 పంచాయతీల్లో సుమారు 90పైగా గ్రామాలు ఉన్నాయి. గతంలో ఈ గ్రామాలకు గ్యాస్ ఏజెన్సీలకు చెందిన సిబ్బంది వచ్చి వినియోగదారులకు సిలిండర్లు అందించేవారు. గ్యాస్ ధరకన్నా రూ.50 నుంచి రూ.80 వరకు అదనంగా తీసుకునేవారు. అయితే గత మూడు వారాలుగా గ్రామాలకు సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వాటిని తెచ్చుకోవడానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరంలోని గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు. దీనికోసం రానుపోను సుమారు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తుంది. సిలిండర్ ధర, ఆటో చార్జీలను కలుపుకొని ఇంటికి తెచ్చేసరికి సుమారు రూ.1600 పైగా ఖర్చు అవుతుందని వినియోగదారులు వాపోతున్నారు. చాలా మందికి గ్యాస్ బుక్ అయినట్లు ఓటీపీలు రావడంలేదు. మరి కొందరకి ఓటీపీలు వచ్చినా సిలిండర్‌ను సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సమాచారం తెలుసుకొనేందుకు ఏజెన్సీలకు ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయడంలేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తే సిబ్బంది ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిలిండర్లను గ్రామాల్లోకి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈవారంలో మూడోసారి..
గతంలో మాకు గ్యాస్ సిలిండర్ విజయనగరం నుంచి వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. ఇటీవల గ్యాస్ బుకింగ్ కోసం విజయనగరం వెళ్లాను. సిలిండర్‌కోసం రావాలా? వద్దా? అని అడిగేందుకు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. సిలిండర్‌ను తెచ్చుకునేందుకు నాలుగు రోజుల కిందట ఏజెన్సీ వద్దకు వెళ్లగా శుక్రవారం రావాలని చెప్పడంతో ఇప్పుడు వచ్చాను. ఏజెన్సీ వద్దకు వెళ్లడం ఈవారంలో ఇది మూడోసారి.
-చోడవరపు పద్మ, వినియోగదారురాలు, భోగాపురం.