goal సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:28 PM
Welfare and development are the goal. మన్యం జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేం దుకు కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గిరిజనుల సంక్షేమం, జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారు లతో సమీక్షించారు.
గిరిజన మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సాహం
ఎల్‌నినోపై అప్రమత్తం.. ఆరుతడి పంటలపై దృష్టి
అధికారుల సమీక్షలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
పార్వతీపురం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేం దుకు కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గిరిజనుల సంక్షేమం, జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారు లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐటీడీఏ, ట్రైకార్‌ల భాగస్వామ్యంతో గిరిజన మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలన్నారు. వారికి పెట్టుబడి సాయం, శిక్షణ అందిం చాలన్నారు. పసుపు, జీడిపప్పు, రబ్బరు, ఇతర సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ యూనిట్లను మహిళా సంఘాల ఆధ్వర్యంలో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. హస్తకళలు, ఫ్యాన్సీ వస్తువుల తయారీ, చీరల డిజైనింగ్ వంటి రంగాల్లో తగిన తర్ఫీదు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిది ద్దాలన్నారు. మట్టితో పాటు గ్రావెల్ వేస్తేనే రహదారి నిర్మాణ బిల్లులను క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. పాత రేట్ల వల్ల 147 బీటీ రోడ్లు పనులు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. కలెక్టర్ సూచనల మేరకు సవరించిన నిధులు అంచనాలతో రెండురోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు పనులు వేగవంతమయ్యేలా ప్రణాళికలు రూపొందించుకో వాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విరాలను సంబంధిత నియోకవర్గ ఎమ్మెల్యేలకు తెలియజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
- ఎల్‌నినో నేపథ్యంలో చిరుధాన్యాలు, శనగలు పెసలు, మినుములు , ఇతర ఆరు తడి పంటల విత్తనాలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. వరి స్థానంలో స్వల్పకాలిక, తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని సూచించారు. అత్యుత్సాహంతో చెరువుల తవ్వకాలు చేపట్టడంపై మంత్రి అసహనం వ్యక్తం చేవారు. దీనివల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల వదద్ద జలహారతి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను అక్టోబరు లేదా నవంబరులో అందించే అవకాశం ఉందన్నారు. అయితే బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాకపోవడం వల్ల చాలా మంది లబ్ధిదారులకు పథకాలు అందడం లేదని ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్క రించి అర్హులదరికీ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
- 2005, డిసెంబరు 13 కంటే ముందు నుంచి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు మంజూరు చేయడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ తేదీ నాటికి సంబంధిత భూమి సాగులో ఉందో లేదో ఉపగ్రహ మ్యాప్‌ల ఆధారంగా సరిచూసి అర్హత కలిగిన వారికి మాత్రమే పట్టాలు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, అధికారులు వివరించారు. 2005కు ముందు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో రీ వెరిఫికేషన్ చేసి, ప్రత్యేక డ్రైవ్ ద్వారా అర్హులైన గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించాలని మంత్రి ఆదేశించారు. కాగా తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు ద్వారా దాదాపు 64 చెరువులు నిండాయన్నారు. జిల్లాలో నీటి లభ్యత పెరిగిందని కలెక్టర్ తెలిపారు.
- జిల్లా పశుసంవర్థక శాఖాధికారి మాట్లాడుతూ.. వీబీ జీ రామ్‌జీ పథకం కింద 2025-26 సంవత్సరానికి 291.75 ఎకరాల భూమిని శాశ్వత పశుగ్రాస సాగు కోసం గుర్తించామన్నారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి పశుగ్రాసం విత్తనాల ఇండెంట్ పూర్తయిందన్నారు. మొత్తంగా 8.795 మెట్రిక్ టన్నుల విత్తనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 20 మహిళా డెయిరీ సహకార సంఘాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
- కురుపాం, పాలకొండ ప్రాంతాల్లో ఏనుగుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కుంకీల సాయంతో అటవీ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతాల్లోకి తరలిస్తున్నామని, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు వాటిని మళ్లిస్తున్నామని తెలిపారు. ఐటీడీఏల ద్వారా చేపడుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ అమలుపై వివరాలు అందించాలని ఎమ్మెల్యేలు కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం , పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, డీఆర్వో కె.హేమలత, ఆర్డీవో మాధురి, డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య మాటల యుద్ధం
సమీక్ష సమావేశంలో మంత్రి సంధ్యారాణి , జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలోనే ఎమ్మెల్యే విజయచంద్ర, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. బలిజపేట మండలం పెదపెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తదితర అంశాలపై పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రోడ్డు వైండింగ్ తదితర పనుల వల్ల ప్రజలు ఇబ్బందుల పడు తున్నారని, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉన్న వ్యక్తికి పనులు ఎలా అప్పగించారని ఎమ్మెల్యే అడిగారు. ఇంతలో కలెక్టర్ జోక్యం చేసుకుని వ్యక్తిగత ఆరోపణలు వద్దని, నోటీస్‌లు ఇచ్చి ఆక్రమణలను తొలగించారని తెలిపారు. చట్టబద్ధంగా మాట్లాడాలని కలెక్టర్ అనడంతో.. తాను అలానే మాట్లాడుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మంత్రి కలుగజేసుకుని శాంతింపజేశారు. ఇది పద్ధతి కాదని, ఏమైనా ఉంటే గదిలో కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. అనంతరం ఆమె కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే విజయచంద్ర, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, ఎమ్మెల్యే జయకృష్ణతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఆర్‌అండ్‌బీ అధికారులకు షోకాజ్ నోటీసులు
సాలూరు నియోజకవర్గంలో బాగువలస, మక్కువ రహదారి పనులు పూర్తికాకపోవడం, సమావేశానికి ఆర్‌అండ్‌బీ అధికారులు హాజరుకాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 29న సీతంపేట, అక్టోబరు 6న పార్వతీపురం ఐటీడీఏల్లో పాలకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
డోలీ రహిత జిల్లాగా మారుస్తాం
గిరిశిఖర ప్రాంతాల్లో 142 బీటీ రోడ్లును నిర్మించి ప్రతి గ్రామానికి అనుసంధానం కల్పిస్తూ.. జిల్లాను డోలీ రహితంగా మారుస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.విలేఖర్లతో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ జిల్లాలో కొండలు, అడవుల వల్ల ఇక్కడ పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదని, వరి సజావుగా సాగుతుందని వెల్లడించారు. 2009 కంటే ముందు నుంచి ఉన్న నివాసితులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు విచారణ ప్రక్రియ ప్రారంభమైంద న్నారు. జిల్లాలోని హాస్టళ్లు, హైరిస్క్ గ్రామాలకు ఉచితంగా 1,07,000 దోమతెరలను పంపిణీ చేశా మన్నారు. సూర్యఘర్ పథకం కింద ఇప్పటికే 8,500 ఇళ్లకు సోలార్ లబ్ధి చేకూరిందని, మరో మూడు నెలల్లో అదనంగా 8 వేలకు ఇళ్లకు విస్తరిస్తామని వెల్లడించారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి కూటమి ప్రభుత్వంఅండగా ఉంటుందన్నారు. ప్రతి పక్షం కాని ప్రతిపక్ష పార్టీ ఉపాధ్యాయులను బెదిరించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.