Share News

Weight mission cheating బరువు.. గ్యారెంటీ కరువు

ABN , Publish Date - May 24 , 2026 | 11:30 PM

Weight mission cheating తూనికలు, కొలతల్లో తేడాల గురించి నిరంతరం చెప్పుకోవడమే కాని సమస్య పరిష్కారం కావడం లేదు. వ్యాపారులు తక్కువ బరువు తూచి పూర్తి బరువుగా నమ్మించడం నిరంతరం జరుగుతూనే ఉంది. మార్కెట్‌ నుంచి సాధారణ దుకాణాల వరకూ ఎందరో వినియోగదారులు నిత్యం మోసపోతున్నారు. అధికారులు మొక్కుబడి తనిఖీలు చేయడం.. ఫిర్యాదు వస్తేనే కదలడంతో ఈ పరిస్థితి మారడం లేదు. ఒకవేళ గుర్తించినా ఫైన్‌ వేసి వదిలేస్తున్నారు. ఫైన్‌ వేసేది ఎప్పుడో కదా అని వ్యాపారులు లైట్‌ తీసుకుంటున్నారు.

Weight mission cheating బరువు.. గ్యారెంటీ కరువు

బరువు.. గ్యారెంటీ కరువు

జిల్లాలో తూనికలు కొలతల్లో కొనసాగుతున్న మోసాలు

మార్కెట్‌, బయట దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి

అపరాధ రుసుంతోనే సరిపెడుతున్న అధికారులు

అప్పుడప్పుడే తనిఖీలు

వెంటాడుతున్న సిబ్బంది కొరత

జిల్లాలో ఒకే ఒక తనిఖీ అధికారి

తూనికలు, కొలతల్లో తేడాల గురించి నిరంతరం చెప్పుకోవడమే కాని సమస్య పరిష్కారం కావడం లేదు. వ్యాపారులు తక్కువ బరువు తూచి పూర్తి బరువుగా నమ్మించడం నిరంతరం జరుగుతూనే ఉంది. మార్కెట్‌ నుంచి సాధారణ దుకాణాల వరకూ ఎందరో వినియోగదారులు నిత్యం మోసపోతున్నారు. అధికారులు మొక్కుబడి తనిఖీలు చేయడం.. ఫిర్యాదు వస్తేనే కదలడంతో ఈ పరిస్థితి మారడం లేదు. ఒకవేళ గుర్తించినా ఫైన్‌ వేసి వదిలేస్తున్నారు. ఫైన్‌ వేసేది ఎప్పుడో కదా అని వ్యాపారులు లైట్‌ తీసుకుంటున్నారు.

- జిల్లా కేంద్రానికి చెందిన వెంకటరావు ఆర్‌అండ్‌బీ రైతుబజార్‌ వద్ద చేపల మార్కెట్‌లో రెండు కిలోల రోయ్యలు తీసుకున్నాడు. బరువు తక్కువగా ఉందని అనుమానం కలిగి ఇంటివద్దనున్న ఓ కిరాణ షాపులో మళ్లీ తూకం వేశాడు. 1700 గ్రాములే తూగింది. అంటే 300 గ్రాములు తగ్గింది. మోసపోయానని తెలుసుకుని చేసేది లేక మిన్నకుంటిపోయాడు.

- గాజులరేగకు చెందిన వరలక్ష్మీ గంటస్తంభం వద్దనున్న ఓ షాపువద్ద మూడు కిలోల మామిడి పండ్లు తీసుకుంది. బరువుపై అనుమానం కలిగిన ఆమె మరోచోట తూకం వేసి చూసింది. 2600 గ్రాముల బరువు తూగింది. అంటే 400 గ్రాములు తగ్గింది.

విజయనగరం, మే 24 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసరాల క్రయ, విక్రయాల్లో మోసాలు తగ్గడం లేదు. అధికారులు తనిఖీలు చేస్తున్నారే తప్ప కఠిన చర్యలకు దిగకపోవడంతో తూనికలు, కొలతల్లో మోసాలు నియంత్రణలోకి రావడం లేదు. వ్యాపారులు కాటాలు, ఎలక్ర్టానిక్‌ వేయింగ్‌ మిషన్లను ఏడాదికోసారి.. మాన్యువల్స్‌ కాటాలను రెండేళ్లకోసారి రెన్యూవల్‌ చేసుకోవాలి. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. అటు ఆ శాఖకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. జిల్లాలో విజయనగరం, బొబ్బిలిలో ఆ శాఖకు కార్యాలయాలున్నాయి కానీ విజయనగరంలో మాత్రమే ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. బొబ్బిలిలో కార్యాలయంలో ఏడు నెలలుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 656 కేసులు నమోదుచేసినట్టు అధికారులు చెబుతున్నారు. వ్యాపారుల నుంచి రూ.17.62 లక్షల అపరాధరుసుం వసూలు చేశారు. తూనికల యంత్రాల సీళ్లకు సంబంధించి మరో రూ.18.20 లక్షలు వసూలు చేశారు.

యథేచ్ఛగా ట్యాంపరింగ్‌..

ఎలక్ర్టికల్‌ వేయింగ్‌ మిషన్లను ట్యాంపరింగ్‌ చేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. పెట్రోల్‌ బంకుల్లో ఈ తరహా ఘటనలు కోకొల్లలు. బంకుల యాజమాన్యాలు లీటరు పెట్రోల్‌ వద్ద 100, 200 వరకూ మిల్లీ లీటర్లు పక్కదారి పట్టిస్తున్నారు. బంకుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. ఏరోజుకారోజు బంకుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రదర్శించాలి. ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో వినియోగదారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇటు గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. 25 కేజీల సిమెంట్‌ బస్తా వద్ద కేజీ, కేజీన్నర తరుగు వస్తోంది. కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నా కొంతమంది దళారులు బస్తాల్లో సిమెంట్‌ తీసి రీ ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఇనుము కేజీలెక్క విక్రయించాల్సి ఉన్నా జిల్లాలో చాలామంది వ్యాపారులు విడి పరికరాల కింద అమ్ముతున్నారు. వంట గ్యాస్‌లో కూడా మోసం పెరుగుతోంది. కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్‌ కాకుండా డెలివరీ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు.

ఫ నిత్యావసరాలు, ఆహార పదార్థాల గురించి చెప్పనక్కర్లేదు. నాణ్యతలోను, తూనికల్లోనూ మోసమే కనిపిస్తోంది. కిరాణా దుకాణాల నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకూ కాటా ట్యాంపరింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. కిలో దగ్గర 200 గ్రాముల వరకూ తగ్గించి అమ్ముతున్నారు. కొన్నింటికి ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా లూజు విక్రయాలు చేస్తున్నారు. వంట నూనెలో కూడా కల్తీ జరుగుతోంది. ప్రధానంగా వారపు సంతల్లో తూనిక రాళ్లతో విక్రయిస్తున్నారు. ఈ మోసాలపై తూనికలు కొలతల శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

మోసం గుర్తిస్తే ఫిర్యాదు చేయాలి

ఎక్కడైనా మోసాలకు పాల్పడితే వెంటనే ఫిర్యాదుచేయాలి. తూనికలు, కొలతలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపార సంస్థలు నిర్ణీత ప్రమాణాలు పాటించాలి. లేకుంటే చర్యలు తప్పవు. సిబ్బంది కొరత ఉన్నా ఉన్నంతలో తనిఖీలు చేపడుతున్నాం.

- బి.మనోహర్‌, లీగల్‌ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్‌, విజయనగరం

----------------

Updated Date - May 24 , 2026 | 11:30 PM