పెళ్లింట విషాదం
ABN , Publish Date - May 02 , 2026 | 12:18 AM
మిర్తివలస గ్రామంలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. మరికొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగుతాయనగా పెళ్లి కొడుకు అన్నయ్య విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
- విద్యుదాఘాతంతో పెళ్లికొడుకు అన్నయ్య మృతి
సంతకవిటి, మే 1(ఆంధ్రజ్యోతి): మిర్తివలస గ్రామంలో ఓ పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. మరికొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగుతాయనగా పెళ్లి కొడుకు అన్నయ్య విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్తివలస గ్రామానికి చెందిన పొన్నాడ వెంకటరమణారావు, పుష్పలతకు ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు దీపక్‌కుమార్‌కు శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. తెల్లవారుజామునే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కరుగా నిద్రలేచి స్నానాలు చేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు అన్నయ్య సతీష్(32) కూడా స్నానం చేసేందుకు పై అంతస్తుకు వెళ్లాడు. స్నానం ముగించుకుని తడి లుంగీని ఆరబెట్టే సమయంలో అనుకోకుండా విద్యుత్ తీగను తాకగా, షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన సతీష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి వేడుక కోసం వెలిగించిన సీరియల్ లైట్లు ఆ కుటుంబానికి యమపాశాలుగా మారడం అందరినీ కలిచివేసింది. మృతుడి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి ఇటీవల వివాహం కాగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.