Share News

మూడు నెలల్లో వివాహం.. అంతలోనే..

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:34 AM

మరో మూడు నెలల్లో పెళ్లిపీటలు ఎక్క బోతున్న తరుణంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

మూడు నెలల్లో వివాహం.. అంతలోనే..

  • రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

  • మరొకరికి తీవ్ర గాయాలు

భోగాపురం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మరో మూడు నెలల్లో పెళ్లిపీటలు ఎక్క బోతున్న తరుణంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలస బాలాజీనగర్‌కు చెందిన పాలపర్తి రవీంద్ర(24), తమ్మిన జయంతికుమార్‌ అనే ఇద్దరు యువకులు భోగాపురం ఎయిర్‌పోర్టులో సెప్టిక్‌ ట్యాంక్‌ వాహన డ్రైవర్లుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి ఎయిర్‌పోర్టులో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై భోగాపురం వైపు నుంచి తగరపువలస వైపు వెళ్తున్నారు. పోలిపల్లి సమీపంలోకి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఇసుక లారీ ఢీకొంది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ చికిత్స నిమిత్తం తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రవీం ద్ర తలకు బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీంద్ర శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. జయంతికుమార్‌ కాలు విరిగిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రవీంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సుందర పేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర చిన్నతనంలోనే తన తల్లి అంజమ్మ మృతిచెందింది. రవీంద్రకు తండ్రి కాటయ్య, అన్న అర్జున, వదిన శైలు ఉన్నారు. వదిన చెల్లితోనే మరో మూడు నెలల్లో రవీంద్రకు వివాహం చేసేందుకు కుటుం బం నిర్ణయించుకుంది. వివాహానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే ఈవిధం గా జరగడంతో కుటుంబీకులు దుఃఖ సాగరంతో మునిగిపోయారు.

Updated Date - Aug 24 , 2026 | 12:34 AM