Share News

We will study there. అక్కడే చదువుకుంటాం

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:01 AM

We will study there. జిల్లాలో ప్రభుత్వ విద్యకు ఆదరణ పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డుస్థాయిలో అడ్మిషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. వైసీపీ హయాంలో పూటకో జీవోతో, రోజుకో ఉత్తర్వుతో అస్తవ్యస్త విధానాలు నడిచేవి. కేవలం నాడు-నేడుతో హడావుడి తప్ప..లోలోపల విద్యావ్యవస్థ పూర్తిగా గాడిన తప్పింది.

We will study there. అక్కడే చదువుకుంటాం

అక్కడే చదువుకుంటాం

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాలు

6,7,8 తరగతుల్లో అత్యధికంగా చేరిక

జిల్లా వ్యాప్తంగా కొత్తగా చేరిన 4 వేల మందికి పైగా విద్యార్థులు

విద్యావ్యవస్థను గాడిన పెడుతున్న ప్రభుత్వం

- రాజాం మండలం గార్రాజు చీపురుపల్లిలో ఒకేరోజు ప్రైవేట్‌ స్కూల్‌నుంచి 40మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అక్కడ విద్యతో పాటు వసతులు కూడా బాగున్నాయనే పాఠశాలలో తమ పిల్లలను చేర్పించినట్లు తల్లిదండ్రులు చెప్పారు.

- రాజాం మండలం బొద్దాంలో ఒకే రోజు 85మంది ప్రైవేట్‌ స్కూల్లో చదివే విద్యార్థులు జడ్పీ ఉన్నత పాఠశాలలో చేరారు. వారికి ఉపాధ్యాయులు పూలు చల్లి మేళతాలలతో ఘన స్వాగతం పలికారు.

- విజయనగరం కుమ్మరివీధిలోని కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది నో అడ్మిషన్ల బోర్డు పెట్టారు. ఇక్కడ 1 నుంచి 8 వ తరగతి వరకూ గత ఏడాది 410 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది 467కు చేరికలు పెరిగేసరికి విద్యార్థులకు సరిపడా వసతి లేకపోవడంతో ఉపాధ్యాయులు నో అడ్మిషన్ల బోర్డు ఏర్పాటుచేయాల్సి వచ్చింది.

విజయనగరం, జూలై 26(ఆంధ్రజ్యోతి)::

జిల్లాలో ప్రభుత్వ విద్యకు ఆదరణ పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డుస్థాయిలో అడ్మిషన్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. వైసీపీ హయాంలో పూటకో జీవోతో, రోజుకో ఉత్తర్వుతో అస్తవ్యస్త విధానాలు నడిచేవి. కేవలం నాడు-నేడుతో హడావుడి తప్ప..లోలోపల విద్యావ్యవస్థ పూర్తిగా గాడిన తప్పింది. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా నారా లోకేష్‌ పాఠశాల విద్యాశాఖ బాధ్యతలు చూసిన తరువాత క్రమేపీ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఉపాధ్యాయుల నియామకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పటిష్టంగా మెనూ అమలుచేయడం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుచేయడం వంటి కారణాలతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కుదిరింది. కేవలం రెండేళ్లలో విద్యావ్యవస్థపై ప్రచారం కంటే మార్పు తీసుకొచ్చి ప్రజలకు చూపించారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం పెరిగింది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

జిల్లాలో 1,446 ప్రాథమిక పాఠశాలలు, 280 ప్రాథమికోన్నత పాఠశాలలు, 499 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు మొత్తం 2225పాఠశాలల్లో 2,07,176 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఉన్నఫలంగా అడ్మిషన్లు పెరిగాయి. కొంతమంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి తెచ్చి మరీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రధానంగా 6,7,8 తరగతుల్లో అడ్మిషన్లు పెరుగుతుండడం విశేషం. ప్రాథమిక తరగతులను ప్రైవేటు పాఠశాలల్లో పూర్తిచేసిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో చాలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగి నో అడ్మిషన్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్టు తెలుస్తోంది. ఒక్కో చోట 25 మంది నుంచి 75 మంది వరకూ చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా విజయనగరం మండలం జమ్ము నారాయణపురం, చీపురుపల్లి మండలం జి,ములగాం, విజయనగరం మండలం మలిచర్ల, జామి మండలం పాత భీమసింగి, పూసపాటిరేగ మండలం గుంపాం, రాజాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, వంగర మండలం సంగాం, గజపతినగరం ఎస్‌ఆర్‌ఆర్‌పురం, రాజాం మండలం బొద్దాం పాఠశాలలు అడ్మిషన్లపరంగా ముందువరుసలో ఉన్నాయి.

ప్రభుత్వ చర్యలతోనే..

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడ్డాయి. డిజిటల్‌ తరగతులు, తాగునీరు, మరుగుదొడ్లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచితంగా పుస్తకాలు, యూనీఫారాలు, నోటు పుస్తకాలు, దాతలు సమకూర్చిన ఏసీ తరగతి గదులు.. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెరగడంతో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. మరోవైపు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మరింత మెరుగ్గా అందుతుండడం విద్యార్థుల చేరికకు మరో కారణం. ప్రతిరోజూ 99,148 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్నారు. మెనూ ప్రకారం అన్నం, పప్పు, కూరగాయలు, కోడిగుడ్లు వంటి పదార్థాలతో అందిస్తున్నారు. శుక్రవారం ప్రత్యేక వంటకాలు అందిస్తున్నారు. రోజుకో ఉపాధ్యాయుడికి పర్యవేక్షక బాధ్యతలు అప్పగించే వీలుగా ఒక రోస్టరు చార్టును సిద్ధం చేశారు. ఎప్పటికపడు మధ్యాహ్న భోజన వివరాలను యాప్‌లో నమోదు కూడా చేస్తున్నారు. ఇంకోవైపు డీఎస్సీతో ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయి. అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు, తల్లికి వందనం పథకం కింద సాయం వంటివి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుండడం శుభ పరిణామం.

- ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం, ఉచిత యూనిఫారాలు, షూలు, పుస్తకాలు అందిస్తున్నారు. అంతేకాకుండా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను బోధిస్తున్నారు. ‘తల్లికి వందనం పథకం’ ద్వారా కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంత మందికీ నగదు ప్రోత్సాహకాలు అందచేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ స్కూల్స్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూకడుతున్నారు.

అడ్మిషన్లు పెరిగాయి

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. ప్రభుత్వ ఆదేఽశాలు, కలెక్టర్‌ ఎస్‌.రామసుందరరెడ్డి సూచనలతో వేసవి సెలవుల్లో తల్లిదండ్రులను ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది కలిసి అవగాహన కల్పించాం. ప్రభుత్వం సైతం పాఠశాలలను బలోపేతం చేసింది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక వసతులు కారణంగా తల్లిదండ్రులు పిల్లలను పెద్ద ఎత్తున పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

- యూ.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం

-------------------------

Updated Date - Jul 27 , 2026 | 01:01 AM