ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:46 AM
‘ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేసి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
- డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం
- అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం
-మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
- పార్వతీపురం, పాలకొండలో పర్యటన
పార్వతీపురం/పార్వతీపురం టౌన్/పాలకొండ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): ‘ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేసి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేస్తాం. డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరిస్తాం. మురుగునీటి సమస్య పరిష్కారానికి అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.’ అని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన పార్వతీపురం మున్సిపాల్టీ, పాలకొండ నగర పంచాయతీలో సుడిగాలి పర్యటన చేశారు.
పాలకొండ నగర పంచాయతీకి వరాల జల్లు
పాలకొండ నగర పంచాయతీకి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వరాల జల్లు కురిపించారు. నగర పంచాయతీ అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించేందుకు పట్టణం చేరుకున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సబ్‌కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్‌తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. మురుగు కాలువల్లో తాగునీటి పైపులు ఉండడంతో కొన్నిసార్లు లీకై కలుషిత నీరు వస్తుందని, తద్వారా రోగాల బారిన పడుతున్నామని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన తాగునీరు, డ్రైనేజీ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీనిచ్చారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికీ మంచినీరు సౌకర్యం కల్పించడానికి రూ.72.5 కోట్లు మంజూరు చేశామన్నారు. రాబోయే రెండేళ్లలో ఈ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో మురుగునీటి సమస్య పరిష్కారానికి రూ.11 కోట్లు కేటాయించామన్నారు. ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. మురుగునీటి సమస్య పరిష్కారానికి అత్యాధునిక ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే పాలకొండ నగర పంచాయతీకి 1.78 కోట్లతో చెత్త ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేశామన్నారు. మే నెల నుంచి చెత్త ప్రాసెసింగ్ పనులు చేపడతామని, పట్టణంలో డంపింగ్‌యార్డు సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. అలాగే పట్టణంలోని నూతన కాలువల నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 15న పాలకొండకు ప్రత్యేక బృందాన్ని పంపించి సర్వే చేసి తొలిఫేజ్‌లో అధిక జనాభా ఉన్న ప్రాంతాలను గుర్తించి కాలువల నిర్మాణం చేపడతామన్నారు. దశలవారీగా పట్టణమంతా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న వెంకటరాయుని కోనేరు అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ఇక్కడ జిమ్, వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనం ప్రోత్సహించడం, ఫుడ్ కోర్టులు నిర్వహణ వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్‌కు సూచించారు. పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లోనూ పచ్చదనం పెంపొందించేలా ప్రతి ఐదు మీటర్లకు ఒక మొక్క నాటాలన్నారు. పాలకొండ రహదారి విస్తరణకు తమ వంతు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ డిపో నుంచి కార్గిల్ జంక్షన్ వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. తమశాఖ నుంచి డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటూ, నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. అంతకుముందు కోటదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాదశర్మ, ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ పూరకుంభంతో మంత్రిని ఆహ్వానించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, నాయకులు పల్లా కొండలరావు, గంటా సంతోష్‌కుమార్, గుమ్మిడి సింహాద్రి, కొరిగాన గంగునాయుడు తదితరులు పాల్గొన్నారు.
పాలిథిన్ నిషేధానికి చర్యలు..
పట్టణంలో పాలిథిన్‌ను నివారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. పెదకాపువీధి, గటాలడెప్పివీధి, కస్పావీధి, మేదరవీధి తదితర శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ సమయంలో ఎటువైపు చూసినా చెత్తాచెదారాలతో పాటు పాలిథిన్ వ్యర్థాలు అధికంగా కనిపించడంతో వాటిని తొలగించాలని సబ్‌కలెక్టర్‌కు సూచించారు. వీటి తొలగింపునకు తక్షణం రూ.5 లక్షల నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు పాలిథిన్ వినియోగంపై జరిగే అనర్థాలను వివరించాలని అన్నారు.
నారాయణమూర్తినగర్ పార్క్‌కు రూ.కోటి మంజూరు
జిల్లా కేంద్రం పార్వతీపురంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత పదో వార్డులో పర్యటించారు. ప్రతి వీధిలో మంత్రి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు కాలువల సమస్య ప్రధానంగా ఉందని, వాటిని పరిష్కరించాలని స్థానికులతో పాటు ఎమ్మెల్యే విజయచంద్ర మంత్రిని కోరారు. వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం 4వ వార్డులోని సౌందర్య నారాయణమూర్తినగర్‌లో ఉన్న పార్క్‌ను సందర్శించారు. పార్క్ అభివృద్ధికి అవసరమైన నిధులతో పాటు మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. వెంటనే మోడల్ పార్కుగా తీర్చిదిద్దే విధంగా కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనంతరం పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న డంపింగ్‌యార్డుతో పాటు చెత్త రీసైక్లింగ్ చేస్తున్న యూనిట్‌ను మంత్రి పరిశీలించారు. చెత్త సేకరణ స్థలం చిన్నదిగా ఉందని, ఎకరా స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డిని ఆదేశించారు. టిడ్కో సముదాయాలను పరిశీలించి నిర్మాణ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమరావతి రాజధానిగా పార్లమెంట్‌లో బిల్లు అమోదం పొందడంపై మంత్రితో ఎమ్మెల్యే కేక్ కట్ చేయించారు. ఆయన వెంట కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కమిషనర్ పావని, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, పట్టణ అధ్యక్షుడు మధు, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ ఉన్నారు.