అవహేళన చేస్తే ఊరుకోం
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:21 AM
ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ వారిని అవహేళన చేస్తే ఊరుకోబోమని మాజీ డిప్యూటీ సీఎం
కురుపాం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ వారిని అవహేళన చేస్తే ఊరుకోబోమని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హెచ్చరించారు. మంగళవారం కురుపాంలోని వైరిచర్ల ప్యాలెస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను మాలోకం అని సంబోధించడంపై అభ్యంతరం తెలిపారు. గతంలో రెండు సార్లు ఇక్కడి గిరిజనుల ఓట్లతో గెలిచిన పుష్ప శ్రీవాణి ఇప్పుడు ఒక గిరిజన ఎమ్మెల్యేను అవహేళన చేయ్యడమంటే ఈ ప్రాంతంలోని గిరిజనులందరినీ అవమానించినట్లేనని భావోద్వేగానికి లోనయ్యారు. మరోసారి గిరిజనులను కించపరిస్తే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పుష్ప శ్రీవాణి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆమె టిక్‌టాక్‌లు, డాన్స్‌లు అందరికీ తెలుసునన్నారు. ఆమె డిప్యూటీ సీఎంగా చేసిన అవినీతిని వెలికి తీస్తామని హెచ్చరించారు. క్వారీకి వేసిన రోడ్లు, ప్రభుత్వ సొమ్ముతో ఇంటి ప్రహరీ ఎలా నిర్మించుకున్నావో బయటపెట్టి వాటిని కూల్చేస్తామన్నారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేని వైసీపీకి డీఎస్సీ కోసం మాట్లాడే హక్కు లేదన్నారు. డీఎస్సీ కోసం చర్చించేందుకు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే జగదీశ్వరిపై మాజీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు సబబుగా లేవన్నారు. మరోసారి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమన్నారు. సమావేశంలో కార్యక్రమంలో డొంకాడ రామకృష్ణ, దత్తి లక్ష్మణరావు, కోలా రంజిత్‌కుమార్, శేఖర పాత్రుడు, అక్కెని మధు, గార రాంబాబు తదితరులున్నారు.